తెలంగాణ రైతుకు పెద్దగా ఉపయోగపడని రైతు బీమా
x

తెలంగాణ రైతుకు పెద్దగా ఉపయోగపడని రైతు బీమా

భూమి ఉన్నవారికే పథకం వర్తించటంతో కౌలు రైతులు, వ్యవసాయం చేసే రైతుల పిల్లలు లబ్ది పొందటం లేదు


ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన ప్రక్రియను తొందరగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు భీమా పథకం ప్రారంభించాక ఈ సమస్య మరింత జటిలం అయ్యిందని రైతు సంఘాలు సూచిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో పెరుగుతున్న ఆత్మహత్యల నేపధ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవటానికి నష్ట పరిహార చెల్లింపు ప్రక్రియను అప్పటి వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. జీవో 421 ని జూన్ 1, 2004 లో జారీచేసి ఆ కుటుంబాలకు ఒక లక్ష చెల్లించి, మరో రు. 50,000 ను అప్పు ఇచ్చిన ఋణదాతలకు చెల్లించి వారిని ఋణ విముక్తులను చేసే పద్దతిని తెచ్చింది.

ఈ చెల్లింపు మొదట మండల స్థాయిలో తరువాత ఆ జిల్లా స్థాయిలో సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారుల నివేదిక మీద ఆధారపడి జరుగుతుంది. కుటుంబం మరో సారి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండటానికి రు. 50,000 లలో రైతు తీసుకున్న అప్పులకు గాను ఒక కమిటీ ఆ మొత్తాన్ని ఋణదాతలకు చెల్లిస్తుంది. చదువుకునే పిల్లలకు సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల, హాస్టల్ లో సీటు, ఒక నివాస గృహం, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, పెన్షన్ లు ఆ కుటుంబానికి దక్కుతాయి. వీటి అమలుకు ఉద్దేశించిన నిబంధనలను అవసరం మేరకు సడలించాలని కూడా జీవో నిర్దేశించింది.

రాష్ట్ర విభజన జరిగి 2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత బిఆర్ఎస్ ప్రభుత్వం జీవో 173 ను జారీచేసి నష్టపరిహారాన్ని రు. ఐదు లక్షలకు, ఋణదాతల నుండి విముక్తికి రు. లక్ష కేటాయించారు. దీనికి అదనంగా జీవో 421 లో కుటుంబానికి సూచించిన సౌకర్యాలను రాష్ట్రం కొనసాగించింది.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి నమోదు చేస్తున్న ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త పులి రాజు రైతు కుటుంబాలు వాస్తవిక అర్థంలో ఎప్పుడూ ఋణ విముక్తి కాలేదని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై రైతు ఆత్మహత్యల గోస, వేలూరు ఆత్మహత్యల గోస అనే రెండు పుస్తకాలు పులి రాజు రాశారు. తన స్వంత ఖర్చులతో కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారంతో ఆయన వీటిని వ్రాసారు.

“రైతులకు రుణాలు ఏమి కుదువ పెట్టుకోకుండా వారి కుటుంబ సభ్యులో దగ్గర సంబంధీకులో ఇస్తుంటారు. ఇచ్చే వాళ్ళు కూడా పెద్దగా ఉన్న కుటుంబాలు కాదు. ఇవ్వం అని తీసుకున్న కుటుంబాలు అన్న దాఖలా లేదు,” అని ఆయన తెలిపారు.

ఈ ప్రక్రియలో చనిపోయిన రైతుకు భూమి తన పేరు మీద ఉండాల్సిన పని లేదు. అధికారుల కమిటీ సిఫారసు మేరకు కౌలు రైతులు కూడా సహాయం పొందచ్చు. బిఆర్ఎస్ 14 ఆగస్టు, 2018 లో రైతు భీమా ప్రవేశపెట్టాక అధికారుల కమిటీలు గ్రామాలకు వెళ్ళి నిజనిర్ధారణ చేయటం నిలిపివేశాయి. పథకానికి భీమా ప్రభుత్వం ఎల్ఐసీ చెల్లించగా, తమ పేరు మీద వ్యవసాయ భూమి ఉన్న 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ పథకం వర్తిస్తుంది. చెల్లింపు రైతు చావుకు కారణంతో నిమిత్తం లేకుండా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సరాసరి 20,000 మంది రైతు కుటుంబాలకు ఐదు లక్షల భీమా చెల్లిస్తున్నటు గణాంకాలు చెపుతున్నాయి.

సంవత్సరం - ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య

2014- 1347

2015- 1400

2016- 645

2017- 851

2018 - 908

2019- 499

2020-471

2021- 352

2022 - 178

2023 - 56

(మూలం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం 1995 నుండి 2021 వరకు 32,460 మంది రైతులు తనువు చాలించారు. రాష్ట్రం అవతరించాక 2014 నుండి 2023 వరకు 6,707 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024 లో 229 మంది, 2025 సంవత్సరంలో 267 ఆత్మహత్యలు జరిగినట్టు పత్రికల్లో వచ్చిన సమాచార గణన ఆధారంగా తెలుస్తోందని రాజు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 29/10/2015 లో జీవో 173 స్థానంలో జీవో 194 జారీ చేస్తూ 2, జూన్ 2014 నుండి ఆత్మహత్య చేసుకున్న రైతులందరికి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. రైతు భీమా 2018 నుండి అమలు కావటంతో రాష్ట్రంలో జీవో 194 ప్రకారం అధికారుల ఫీల్డ్ విజిట్లు ఆగిపోయాయి. గడువు తేదీ మార్చటంతో అర్హులైన వారందరికీ పరిహారం కోరుతూ రైతు స్వరాజ్య వేదిక తెలంగాణ హై కోర్టును ఆశ్రయించింది. 2014 నుండి 2022 మధ్య చనిపోయిన 141 మంది రైతులకు జీవో 194 ప్రకారం రు. ఆరు లక్షలు చెల్లించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (101/2022) వేయగా కోర్టు ప్రభుత్వం రు. 9.98 కోట్లు చెల్లించాలని ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వం చెల్లింపులో అలక్ష్యం వహించటంతో తిరిగి కోర్టు ధిక్కార కేసు (2587/2024) వేసింది. ఆ తరువాత గానీ రాష్ట్ర ప్రభుత్వం రు. 9.98 కోట్లు చెల్లించలేదని రైతు స్వరాజ్య వేదిక కార్యకర్త బి. కొండల్ రెడ్డి తెలిపారు.

B. Kondal Reddy

“2014 తరువాత 7,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో జీవో 194 ప్రకారం నేటికీ 1,917 మందికి మాత్రమే రు. ఆరు లక్షలు లభించింది. మిగిలిన 5,083 మందికి సంబంధించి విచారణలు నత్తనడకన నడుస్తున్నాయి లేదా అసలు ప్రక్రియ మొదలు కాలేదు. ఐదు సార్లు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తేనే ఈ మాత్రమైన చెల్లింపులు జరిగాయి. ఇంకా 200 మందికి సంబంధించిన వ్యాజ్యం (29/2025) విచారణలో ఉంది,” అని ఆయన తెలియ చేశారు.

“భీమా పథకం అమలు భూ యజమానికే అమలు కావటంతో తమ పేరుమీద భూమి లేని అతని పిల్లలు, కౌలు రైతులు దాని పరిధిలోకి రావటం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే రు. ఐదు లక్షలకు వాళ్ళు దూరం అవుతున్నారని చాలా కాలంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాము,” అని చెప్తూ భీమా పథకాన్ని కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అమలు చేయటమే పరిష్కారమని కొండల్ రెడ్డి తెలిపారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2023 లో ఆత్మహత్యలు కేవలం 56 కాగా మేము సేకరించిన గణాంకాల ప్రకారం 271 మంది చనిపోయారు. 2024 లో 249 మంది, 2025 లో 294, 2026 లో నేటి వరకు 17 మంది రైతులు చని పోయారని ఆయన తెలియచేసారు.

Read More
Next Story