‘వారిపై 6 గంటలలోపే ఎఫ్‌ఐఆర్ ’
x
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న మెడికోలు . ఫైల్ ఫోటో

‘వారిపై 6 గంటలలోపే ఎఫ్‌ఐఆర్ ’

విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


కోల్‌కతా మహానగరం అట్టుడికిపోతుంది. ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతో వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బుధవారం అర్ధరాత్రి దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కర్రలు, ఇటుకలు, రాడ్లతో అత్యవసర గది, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో (ఓపీడీ)పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) డాక్టర్ అతుల్ గోయెల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. AIIMS సహా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఈ ఆదేశాలను పంపారు.

‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడులు సర్వసాధారణమైనట్లు మా దృష్టికి వచ్చింది. విధుల్లో భాగంగా పలువురు సిబ్బంది శారీరక హింసకు గురయ్యారు. మరికొందరికి బెదిరింపులు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం రోగి లేక రోగి వెంట వచ్చిన వారివల్ల ఎదుర్కొన్నవే. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసకు గురయితే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’’ అని కేంద్రం వెల్లడించింది.

Read More
Next Story