పశు జనరిక్‌ మెడికల్‌ షాపు భారతదేశంలో ఎక్కడుందో తెలుసా? ఒకే ఒక్కచోట మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మనుషులకు జనరిక్‌ మెడిసిన్స్‌ రావడం చూశాం.


పశువులకు జనరిక్‌ మెడిసిన్స్‌ రావడం దేశంలో మొదటి సారి. 11 నెలల క్రితం దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడ నగరంలో ఏర్పాటైంది. భారతదేశంలో మొదటి సారిగా విజయవాడ సూపర్‌ స్పెషాలిటీ పశువైద్య కేంద్రంలో జనరిక్‌ పశు ఔషద కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. జనరిక్‌ పశు ఔషద కేంద్రం నిర్వహణకు వెటర్నరీ ఫార్మసిస్ట్‌లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ మేరకు దరఖాస్తులు చేసుకున్న వారిలో ఒకరిని ఎంపిక చేసి విజయవాడలోని సూపర్‌స్పెషాలిటీ పశువైద్య శాలలో మొదటిసారిగా జనరిక్‌ పశువైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెడికల్స్‌లో పశువులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంటాయి.

మొదటి సారి ప్రారంభమైన పశు జనరిక్‌ మెడికల్‌ షాప్‌
ఈ ఔషద కేంద్రాన్ని 2023 మార్చి 23న ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. రాష్ట్రంలోని పశు పోషకులకు తక్కువ ధరకు నాణ్యమైన జనరిక్‌ మందులను అందించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ పశు ఔషద నేస్తం పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం నిరుద్యోగులైన వెటర్నరీ ఫార్మాశిస్ట్‌లకు ఉపయోగపడుతుందని పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ అమరేంద్ర తెలిపారు.
ముంబాయి నుంచి మందుల కొనుగోలు
ప్రస్తుతానికి దేశంలో పశు ఔషద జనరిక్‌ తయారీ కేంద్రం ముంబాయిలో మాత్రమే ఉంది. జనరిక్‌ ఆధార్‌ పేరుతో ఉత్పత్తి జరుగుతోంది. అయితే అవసరాలకు తగినంత మెడిసిన్‌ తయారు కావడం లేదు. విజయవాడలోని జనరిక్‌ ఆధార్‌ ఔషద కేంద్రం వాళ్లు పెట్టిన ఇండెంట్‌ ప్రకారం మందులు సరఫరా కావడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు, ఇప్పటి వరకు జనరిక్‌ మెడిసిన్‌ పశువులకు తయారు చేయాలనే ఆలోచన ఏ కంపెనీ వారికి కూడా రాలేదు. త్వరలో ఎక్కువ కంపెనీల వారు తయారుచేసే అవకాశం ఉంది. ఎక్కువ పశు జనరిక్‌ తయారీ కంపెనీలు రావడంతో పాటు కనీసం రాష్ట్రానికి ఒక పశు జనరిక్‌ మెడికల్‌ షాపు ఏర్పాటు కావాల్సి ఉంది. దీని వల్ల జనరిక్‌ మెడిసిన్‌ సేల్స్‌కు తగిన విధంగా తయారు చేసే అవకాశం ఉంటుంది.
జనరిక్‌ మెడిసిన్స్‌ రిజల్ట్‌ బాగుంది
జనరిక్‌ ఆధార్‌ వారు అందించే పశు జనరిక్‌ మెడిసిన్‌ రిజల్ట్‌ బాగుందని, మందులు కొనుగోలు చేసిన పశువుల యజమానులు ఈ విషయం చెప్పారని విజయవాడలోని పశు జనరిక్‌ ఔషద కేంద్ర నిర్వాహకుడు మోహన్‌ తెలిపారు. ఆయన ‘ది ఫెడరల్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పశు జనరిక్‌ కేంద్రాన్ని ప్రారంబించినట్లు తెలిపారు. వైఎస్సార్‌ పశు ఔషద నేస్తం పథకం కింద 75శాతం సబ్సిడీ, 25 శాతం లబ్ధిదారు కంట్రిబ్యూషన్‌తో పశు ఔషద కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మెడికల్‌ షాపు ఏర్పాటుకు నాలుగు లక్షలు పెట్టుబడి అయిందని, అందులో మూడు లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వగా, లబ్ధిదారు కంట్రిబ్యూషన్‌ కింద లక్ష ఖర్చు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం జనరిక్‌ ఔషదాలు ముంబయ్‌లో ఒక్క చోట మాత్రమే తయారవుతున్నాయని, దేశంలో విజయవాడలోని ఈ ఒక్క మెడికల్‌ షాపు మాత్రమే ఉన్నందున ఎక్కువ జనరిక్‌ మందులు తయారు చేస్తే కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఉండరనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్‌ కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరికొన్ని జనరిక్‌ షాపులు వస్తే కాని మెడిసిన్‌ సప్లైలో ఇబ్బందులు తొలగుతాయని మోహన్‌ వివరించారు. ప్రస్తుతానికి జనరిక్‌ మెడిసిన్‌తో పాటు సాధారణ మెడిసిన్‌ కూడా ఈ షాపులో అమ్ముతున్నామని, బయట షాపుల్లో ఇచ్చే ధరల కంటే 5శాతం తక్కువకు ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా కుక్కలు, గేదెలు, గొర్రెలు, మేకలు వైద్యశాలకు వస్తున్నాయన్నారు.


Next Story