
AAP ఓటమికి కారణాలివే..
యమునా (Yamuna) నదిని శుభ్రం చేస్తానన్న హామీ నెరవేర్చకపోవడం.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, ఆప్ నేతల అరెస్టు, షీష్ మహెల్ వ్యవహారం.. బీజేపీని గెలిపించాయా?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పాలనను ఈ సారి ఢిల్లీవాసులు వ్యతిరేకించారు. అయితే రెండుసార్లు అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు తరచు ఈ సమస్యను ఎదుర్కొవడం సహజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆప్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే..
ఆప్‌ను టార్గెట్ చేసిన బీజేపీ(BJP)..
2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని అణచివేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం నియమించిన అధికారి, ఢిల్లీలో పాలనా అధికారాన్ని క్రమంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలను అధికారులు అమలు చేయడానికి నిరాకరించడం, సమావేశాలకు హాజరుకాకపోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిని కేజ్రీవాల్ పూర్తిగా అంగీకరించకపోయినా.. కేంద్రంపై తన పరోక్ష పోరు కొనసాగిస్తూనే వచ్చారు.
పార్టీలో ముదిగిన విభేదాలు..
2015-2020తో పోలిస్తే, 2020-25 మధ్య ఆప్ లోపల విభేదాలు ముదిరాయి. ఎన్నికలకు ముందు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, కేజ్రీవాల్ సహచరుడు కైలాష్ గెహ్లాట్ పార్టీని వీడటం మరో దెబ్బ. గెహ్లాట్ ఆరోపణలు ఆప్, కేజ్రీవాల్ ఖ్యాతిని దిగజార్చాయి. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
కాంగ్రెస్ (Congress) కారణంగా దెబ్బతిన ఆప్ ఓటు బ్యాంక్..
కాంగ్రెస్ కారణంగా ఆప్ ఓటు బ్యాంక్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అంటున్నారు. INDIA కూటమిలో భాగస్వాములు అయిన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని భావిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆకర్షించిన ఆప్, ఇప్పుడు అదే ఓటును కోల్పోయింది. కాంగ్రెస్ గెలిచినా, గెలవకపోయినా.. రాహుల్ ఉద్ధృత ప్రచారం ఆప్‌కు తీవ్రనష్టం చేకూర్చింది.
బీజేపీకి కలిసొచ్చిన ప్రచారం..
బీజేపీ విస్త్రృత ప్రచారం ఆప్‌కు ఎదురు దెబ్బ తగిలేలా చేసింది. ఆప్ చేతుల్లో లేని సమస్యలపైనా దుష్ప్రచారం చేయడం, ఢిల్లీ పాలనా సమస్యలన్నింటికీ ఆప్‌ను దోషిగా చేయడం ఓటర్లను ప్రభావితం చేసింది. ఈ కారణంగా ఆప్ అగ్రనేతలు సైతం తమ సొంత నియోజకవర్గాల్లో ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది.
పాలనా వ్యతిరేకత..
ఎన్నికల ఫలితాలకు దారితీసిన మరో కీలక అంశం పాలనా వ్యతిరేకత. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై నిరాశ పెరగడం సహజమే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం మాదిరిగా, ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించలేకపోయింది. గత దశాబ్దంలో ఆప్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ముఖ్యంగా యమునా నదిని శుభ్రం చేస్తానని కేజ్రీవాల్ చేసిన హామీ నెరవేరకపోవడం, ఎన్నికలకు ముందు కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యే పరిస్థితి రావడం పార్టీ విశ్వసనీయతను దెబ్బతీశాయి.
ఇవి అన్నీ కలసి ఆప్, కేజ్రీవాల్ పరాజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.