ఆర్థికవృద్ధికి చోదక శక్తి మనమే : నిర్మలా సీతారామన్
x

ఆర్థికవృద్ధికి చోదక శక్తి మనమే : నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి వరాలు ప్రకటించలేదు. అయితే..


గత పదేళ్ల తమ పాలనలో భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలోనే వేగవంతమైన వృద్దిరేటు సాధించిన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదక శక్తిగా నిలిచిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం లోక్ సభలో 2024-25 ఆర్థిక సంవత్సరపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. 2025-26 నాటికి ఆర్థికలోటును 4.5 శాతానికి కంటే తక్కువకు తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని, 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విధంగా ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రయాణిస్తున్నామని ప్రకటించారు.

మధ్యంతర బడ్జెట్ లో కొత్త గా ఎలాంటి విధానాలను ప్రకటించలేదు. అయితే వివాదాస్పద చిన్నపన్ను డిమాండ్ల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. లోటును తగ్గించుకోవడంతో పాటు ఇప్పుడు కొనసాగుతున్న వృద్దిని అలాగే సాగడానికి గాను మూలధన వ్యయాన్ని 11 శాతం మేర పెంచారు. అంకెల్లో అయితే ఇది దాదాపు 25000 వేల కోట్లుగా ఉంటుంది. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ కావడంతో ఎలాంటి ఆదాయపు పన్నురేట్లు, కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేట్ ఆదాయపన్నులలో మార్పులు ప్రతిపాదించలేదు. గంట కంటే తక్కువ సేపు మాత్రమే నిర్మలాసీతారామన్ ప్రసంగించారు.

రూపాయి రాక.. రూపాయి పోక

ఆదాయంలో సింహభాగం అప్పులు, రుణాలు నుంచే వస్తోంది. దీని వాటా మొత్తం ఆదాయంలో దాదాపు 28 శాతంగా ఉంది. తరువాత స్థానాల్లో ఆదాయపన్ను వాటా 19 శాతం, జీఎస్టీ నుంచి 18 శాతం, కార్పొరేట్ టాక్స్ నుంచి 17 శాతంగా ఉంది.



ఆదాయంలో సింహభాగం రాష్ట్రాలకు వెళ్తోంది. అంటే పన్నుల్లో రాష్ట్రాల వాటా, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. దాదాపు వీటికి ఆదాయంలో 20 మేర ఖర్చు చేస్తున్నారు.తరువాత వాటా కేంద్ర ప్రాయోజిత పథకాలది. వీటికి 16 మేర కేటాయిస్తున్నారు.

మంత్రిత్వ శాఖలకు కేటాయింపు

ఎప్పటిలాగే బడ్జెట్ లో ఎక్కువ భాగం రక్షణ రంగం దక్కించుకుంది. ఈ సారి దీని వాటా రూ. 6.2 లక్షల కోట్లు, తరువాత రోడ్లు హైవేలకీ రూ. 2.78 లక్షల కోట్లు, రైల్వేలకి రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్జీఎస్) కి రూ. 86000 వేట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో దీనికి రూ. 60000 కోట్లు కేటాయించారు.



మూలధన వ్యయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 11.11 లక్షలు గా కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లోటు 5.8 శాతానికి తగ్గించారు. జీడీపీలో బడ్జెట్ లోటును 5.9 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గించారు. ఎన్నికల తరువాత కూడా దేశంలో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే జూలైలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి వివరణాత్మక బడ్జెట్ ప్రవేశపెడతామని ధీమా వ్యక్తం చేశారు. "తదుపరి తరం సంస్కరణలు ప్రారంభిస్తాం, వాటి అమలు కోసం రాష్ట్రాలు ఇతర వ్యవస్థలతో ఏకాభిప్రాయాన్నిసాధిస్తాం" అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 30.03 లక్షల కోట్ల ఆదాయ వసూళ్లు బడ్జెట్ కింద అంచనావేశారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఊపందుకోవడానికి ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి.

Read More
Next Story