ఎన్నికల వేళ.. వంట గ్యాస్ పై మరో వంద...
x

ఎన్నికల వేళ.. వంట గ్యాస్ పై మరో వంద...

మహిళా దినోత్సవ ప్రభావమో ఎన్నికల సందర్భమో గాని గ్యాస్ బండపై వంద తగ్గింది. మహిళలపై భారం తప్పింది


మహిళా దినోత్సవ ప్రభావమో ఎన్నికల సందర్భమో గాని గ్యాస్ బండపై వంద తగ్గింది. మహిళలపై భారం తప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడినా మహిళల సంక్షేమం ప్రత్యేకించి పేద ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశంలో ప్రస్తావించారు. గ్యాస్ ధర తగ్గింపు వల్ల లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా ‘నారీశక్తి’కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9.6 కోట్ల కుటుంబాలు ఈ గ్యాస్ ధర తగ్గింపుతో లబ్ధి పొందుతాయని అంచనా.

‘వంటగ్యాస్‌ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇస్తున్నాం. తద్వారా వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు ప్రధాని. ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రక్షాబంధన్‌ సందర్భంగా గత ఏడాది సిలిండర్‌ ధరను కేంద్రం రూ.200 తగ్గించింది.

"వంట గ్యాస్​ మరింత చౌకగా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతివ్వాలన్న మా లక్ష్యం నెరవేరుతోంది. మహిళల అభ్యున్నతికి, సులభతర జీవితానికి మేము కట్టుబడి ఉన్నాం" అని మోదీ ట్వీట్ చేశారు. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు గ్యాస్​ సిలిండర్​ ధరను తగ్గిస్తున్నట్టు మోదీ ప్రకటించడం గమనార్హం.

హైదరాబాద్​లో గ్యాస్​ సిలిండర్​ ధర ఎంత?

మోదీ ప్రకటనకు ముందు.. హైదరాబాద్‌లో 14.2 కిలోల సబ్సిడీ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. నేటి ప్రకటన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ. 855కు తగ్గనుందని గ్రహించాలి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వంట గ్యాస్​ సిలిండర్​ ధర ఇంచుమించుగా ఇదే విధంగా ఉంది.

అయితే.. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. 19 కిలోల వాణిజ్య ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చ్​ 1న రూ. 25 పెంచాయి. ఫలితంగా.. ఢిల్లీలో.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,795కు చేరింది. ముంబైలో నేటి నుంచి 19 కిలోల సిలిండర్ ధర రూ.1,749గా ఉంది. చెన్నై, కోల్​కతాలో కమర్షియల్ ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1,960, రూ.1,911కు పెరిగాయి.

Read More
Next Story