
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు భారీగా పెంపు..
కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి..
కొత్త సంవత్సరం ధూమపాన ప్రియులకు ఇదొక చేదు వార్త. డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ బిల్లు (Central Excise Amendment Bill, 2025)కు పార్లమెంటులో ఆమోదం లభించడంతో సిగరెట్లు, బీడీలు, జర్దా, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి 1 నుంచి గణనీయంగా పెరగనున్నాయి. ఈ బిల్లుపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడుతూ.. ఇది అదనపు పన్ను కాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రూ. 2.69 లక్షల కోట్ల రుణాన్ని చెల్లించడానికి ప్రస్తుతం పొగాకుపై సెస్ విధిస్తున్నారు.ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటు అదనపు సెస్ వసూలు చేస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం సిగరెట్లు (Cigarettes) పొడవు, ఫిల్టర్‌ను బట్టి 1,000 స్టిక్స్‌కు రూ.2,700 నుంచి రూ.11,000 వరకు పన్ను విధించనున్నారు. నమిలే పొగాకు (Chewing Tobacco): కేజీకి రూ.100 చొప్పున పన్ను ఉంటుంది. ముడి పొగాకుపై ఏకంగా 60-70% వరకు ఎక్సైజ్ సుంకం విధించే ప్రతిపాదన ఉంది. అధిక సుంకాలు ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వంటి సిగరెట్ తయారీదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత రూ.18 ఉన్న ఒక్క సిగరెట్ సుమారు రూ. 72 వరకు చేరవచ్చు అని అధికారిక అంచనా.

