
గ్రౌండ్ రిపోర్ట్: సొంతూరులో ప్రశాంత్ కిషోర్ 'అపరిచితుడు'
ప్రధానిని గెలిపించిన పీకే సొంత గ్రామానికి ఏమీ చేయలేకపోయాడన్న గ్రామస్థుడు.
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ప్రశాంత్ కిషోర్ సొంతూరు బీహార్(Bihar) రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని కర్హాగర్ గ్రామం. ఆయన ఈ మధ్యే పార్టీ పెట్టారు. దాని పేరు జన్ సురాజ్ పార్టీ. పీకేగా పేరున్న ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) అనే వ్యక్తి గ్రామంలో ఎంతమందికి తెలుసన్న విషయాన్ని తెలుసుకునేందుకు ‘ఫెడరల్ దేశ్’ టీం కర్హాగర్‌కు వెళ్లింది. "మీకు ప్రశాంత్ కిషోర్ తెలుసా?" అని అడిగినపుడు చాలామంది గ్రామస్థులు..‘‘ఆయన ఎవరో మాకు తెలియదు’’ అని చెప్పడం అశ్చర్యం కలిగించింది. దీనికి బహుశా కిషోర్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని బక్సర్‌లో గడపడమే కావొచ్చు.
ఎన్నికల సందర్భాల్లో పీకే పేరు టీవీల్లో, సోషల్ మీడియాలో, వార్తాపత్రికలలో ప్రముఖంగా వినిపిస్తుంది. కాని తన గ్రామంలో ఆయనను గుర్తించలేకపోవడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ గురించి 28 ఏళ్ల యువకుడు ఇలా అన్నాడు.. "అతను (కిషోర్) బీహార్ అంతా పర్యటించాడు. కానీ సొంత గ్రామాన్ని సందర్శించలేదు. ప్రజలు అతన్ని ఎలా గుర్తుపడతారు? అని అన్నారు.
ఫెడరల్ దేశ్ మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో కూడా మాట్లాడింది. పీకేను ఎప్పుడూ చూడలేదని, అతని గురించి మాత్రమే విన్నామని చెప్పారు.
తమ గ్రామానికి, ప్రాంతానికి ఏదైనా మేలు చేసేని వ్యక్తులను మాత్రమే జనం గుర్తుంచుకుంటారని మరో మధ్య వయస్కుడు చెప్పారు. “అయన (ప్రధానమంత్రి నరేంద్ర) మోదీతో ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. జనతాదళ్ (యునైటెడ్) ఉపాధ్యక్షుడైనప్పుడు అవకాశం వచ్చింది. కానీ గ్రామానికి ఏమీ చేయలేదు” అని కోపంగా అన్నారు.
గత దశాబ్ద కాలంగా భారత రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో ప్రశాంత్ కిషోర్ ఒకరు. మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గెలవడానికి ఆయన సాయపడ్డారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ విజయం సాధించి, మోదీని మొదటిసారి ప్రధానిని చేసి ఖ్యాతి గడించారు. మరుసటి సంవత్సరం బీహార్ ఎన్నికల్లో జేడీ(యూ), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో కూడిన బీజేపీ ప్రత్యర్థి మహా కూటమికి సాయపడ్డారు. 2018లో ఆయన జేడీ(యూ) ఉపాధ్యక్షుడిగా నియమితులై.. రెండేళ్ల లోపే పార్టీ నుంచి నిష్క్రమించారు.
ఇక 2025 బీహార్ ఎన్నికల(Assembly Elections)లో తమ అభ్యర్థులను బరిలోకి దించిన పీకే తాను మాత్రం పోటీకీ దూరంగా ఉండడం విశేషం. పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.