ఎమ్మెల్యే నితీష్ రాణే మహారాష్ట్ర బిజెపికి తలనొప్పిగా మారాడా?
x
Nitesh Rane

ఎమ్మెల్యే నితీష్ రాణే మహారాష్ట్ర బిజెపికి తలనొప్పిగా మారాడా?

మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే రెచ్చగొట్టే ప్రసంగాలతో వివాదాల్లోకెక్కారు. మసీదుల్లోకి ప్రవేశించి ముస్లింలను కొడతానని అనడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.


మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే రెచ్చగొట్టే ప్రసంగాలతో వివాదాల్లోకెక్కారు. మసీదుల్లోకి ప్రవేశించి ముస్లింలను కొడతానని అనడంతో ఆయనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితీష్ రాణే వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. అధికార బిజెపిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షానికి అవకాశం దొరికినట్లయ్యింది. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ అల్లర్లను సృష్టించి లాభపడాలని చూస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

వివాదాలకు కొత్త కాని బిజెపి లోక్‌సభ ఎంపి నారాయణ్ రాణే స్వయంగా రంగంలోకి పార్టీకి నష్ట నివారణకు చర్యలు చేపట్టారు. తన కుమారుడి వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, మనోభావాలు దెబ్బతిన్న వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

రామగిరి మహారాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు..

ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ గురించి హిందూ ధర్మకర్త మహంత్ రామగిరి మహరాజ్‌ కించపరిచే వ్యాఖ్యలు చేసి గత నెలలో వార్తల్లో నిలిచారు. ఆయనకు మద్దతుగా నితీష్ రాణే ఆదివారం అహ్మద్‌నగర్ జిల్లాలోని శ్రీరాంపూర్, తోప్‌ఖానా ప్రాంతాల్లో రెండు బహిరంగ సభలనుద్దేశించి ప్రసంగించారు. మహారాజ్‌కు హాని చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నితీష్ హెచ్చరించారు కూడా.

వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

‘‘రామగిరి మహారాజ్‌కు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెబితే మేం మీ మసీదుల్లోకి ప్రవేశించి మిమ్మల్ని ఒక్కొక్కరిగా కొడతాము. ఇది గుర్తుంచుకోండి" అనిహెచ్చరిస్తున్న నితీష్ రాణే వీడియో బాగా వైరలయ్యింది. ప్రవక్త మొహమ్మద్, ఇస్లాం గురించి రామగిరి మహరాజ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో మహరాజ్ పై మహారాష్ట్రలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేయాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నితీష్‌పై రెండు కేసులు..

ముంబైకి 260 కిలోమీటర్ల దూరంలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని శ్రీరామ్‌పూర్, తోప్‌ఖానా పోలీస్ స్టేషన్‌లలో నితీష్ రాణేపై నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వకంగా శాంతికి విఘాతం కలిగించడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఒక అధికారి తెలిపారు.ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తోప్‌ఖానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సోమవారం తెల్లవారుజామున శ్రీరామ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మరో నేరం నమోదైంది.

వివాదాలకు కేంద్రం..

నితీష్ రాణేకు వివాదాలు కొత్త కాదు. గ్రామీణ వ్యాఖ్యలకు పేరుగాంచిన ఆయన ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని మాల్వానీ, మాన్‌ఖుర్డ్ , ఘట్‌కోపర్ ప్రాంతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. కోస్తా కొంకణ్‌లోని రత్నగిరి-సింధుదుర్గ్ ఎంపీ అయిన నితీష్ రాణే తండ్రి నారాయణ్ రాణే మాట్లాడుతూ.. ఎక్కడా ఉన్నా ఏ మతాన్ని కించపరిచి మాట్లాడవద్దని తన కుమారుడిని మందలించారని చెప్పారు.

నితేష్ రాణే వీడియోను షేర్ చేస్తూ.. AIMIM అధికార ప్రతినిధి వారిస్ పఠాన్.. BJP శాసనసభ్యుడిని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎక్స్ వేదికగా అభ్యర్థించారు.

"రాణే మొత్తం ప్రసంగం ముస్లింలను ఇది రెచ్చగొట్టేలా ఉంది. ఆయనది ద్వేషపూరిత ప్రసంగం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మత హింసను సృష్టించి బీజేపీ లబ్ధి పొందాలని చేస్తోంది’’ అని పఠాన్ ఆరోపించారు.

శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ కూడా తన పార్టీ మాజీ మిత్రపక్షమైన బిజెపిపై విరుచుకుపడ్డారు. "మీరు (బిజెపి) ఎన్నికల్లో గెలవాలని మహారాష్ట్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లర్లను ఉసిగొల్పకుండా వారు ఎన్నికలను ఎదుర్కోలేరు" అని రాజ్యసభ సభ్యుడు అభిప్రాయపడ్డారు.

నితీష్ రాణే రెచ్చగొట్టే ప్రసంగాలను ఖండించకుండా రాజకీయ నాయకులు హింసకు ఆజ్యం పోస్తున్నారని రౌత్ పార్టీ సహోద్యోగి, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.

ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సల్కర్‌ను కలిసి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు కంకవ్లి ఎమ్మెల్యే, ఇతర బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరింది. నితీష్ రాణే,ఇతర బీజేపీ నేతలకు ఉన్న పోలీసు భద్రతను తొలగించాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.

"మహారాష్ట్రలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారు. మా బాస్ 'సాగర్' బంగ్లాలో కూర్చుంటారని వారు చెబుతూనే ఉన్నారు" అని గైక్వాడ్ విలేకరులతో అన్నారు. 'సాగర్' డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అధికారిక బంగ్లా.

"నితేష్ రాణే (బిజెపి ఎమ్మెల్సీ) ప్రసాద్ లాడ్ చేసిన ప్రకటనలో సాగర్ బంగ్లా, దేవేంద్ర ఫడ్నవీస్ గురించిన ప్రస్తావన ఉంది. వారికి ఆయన దగ్గరి నుంచి ఏదైనా రాజకీయ ప్రోత్సాహం ఉందా ? అనే దానిపై విచారణ జరగాలి" అని ఆమె అన్నారు.

NCP (SP) అధికార ప్రతినిధి అనీష్ గవాండే మాట్లాడుతూ.. నితేష్ రాణే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదని అన్నారు.

"మాబ్ లిన్చింగ్, ద్వేషపూరిత ప్రసంగాలపై తెహసీన్ పూనావాలా తీర్పును ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వంపైనే ధిక్కార కేసులు నమోదు చేయాలి." అని గవాండే నొక్కి చెప్పారు.

శివసేన (UBT), కాంగ్రెస్, NCP (SP) ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) భాగాలు. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన ఉన్నాయి.

Read More
Next Story