పబ్లిసిటీ స్టంట్ మహాయుతి కూటమిలో చీలికలు తెచ్చిందా?
x

పబ్లిసిటీ స్టంట్ మహాయుతి కూటమిలో చీలికలు తెచ్చిందా?

మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పబ్లిసిటీ స్టంట్ నడుస్తోంది. అజిత్ పవార్ ముఖ్యమంత్రి పేరు లేకుండానే ప్రకటనలు ఇవ్వడాన్ని సీఎం షిండే వర్గం తప్పుబడుతోంది.


మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు మొదలయినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేరు లేకపోవడమే అసలు వివాదానికి కారణం. ఇలాంటి ప్రకటన ఇవ్వడం ఏమిటని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిపై శివసేన (షిండే) మహారాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శంభురాజ్ దేశాయ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 సాయం అందించే 'ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్' పథకాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ "హైజాక్" చేశారని ఆరోపించారు. తన (అజిత్) ప్రచారం కోసం పథకం పూర్తి పేరును ఉపయోగించకపోవడం, సీఎం పేరు, ఫొటో లేకపోవడం ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

'సీఎం పేరు తొలగించారు’

‘పథకం పూర్తి పేరు 'ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్'. ఇందులో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించడం సరికాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఆయన (అజిత్) అందరి పేర్లతో ప్రకటన ఇవ్వాలి" అని అని దేశాయ్ పేర్కొన్నారు.

జన్ సన్మాన్ యాత్రకు ముందు..

రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ గత నెలలో 'జన్ సన్మాన్ యాత్ర' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందు అజిత్ పత్రికలకు కొన్ని ప్రకటనలు ఇచ్చారు. అందులో 'ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్' అనే పూర్తి పేరుకు బదులుగా కేవలం 'మాఝీ లడ్కీ బహిన్' అని మాత్రమే కనిపించింది. దీంతో పాటు అజిత్ పవార్ వర్గం రెండు వీడియోలను తయారు చేయించింది. ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం’ లబ్ధిదారులు ఉప ముఖ్యమంత్రికి మాత్రమే కృతజ్ఞతలు చెబుతున్నట్లు వీడియోలో చూపించారు.

అధికారంలోకి వస్తే పింఛన్ రెట్టింపు..

వాస్తవానికి లడ్కీ బహిన్ పథకం పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. దాన్ని ప్రేరణగా తీసుకుని మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద గత నెలలో పింఛన్ పంపిణీని కూడా ప్రారంభించారు. మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే, పింఛన్ రెట్టింపు చేసి రూ.3,000 ఇస్తామని సీఎం షిండే హామీ ఇచ్చారు.

విభేదాలకు దూరంగా ఉండాలి..

గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో శివసేన (షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్) నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అజిత్ పవార్ అనారోగ్య కారణాలతో సమావేశానికి రాలేదు. పథకాల పబ్లిసిటీ ప్రకటనలో ముఖ్యమంత్రి పేరును ఎలా తొలగిస్తారని దేశాయ్ ప్రశ్నించారు. ఇంతలో ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కలగజేసుకున్నారు. షిండే పేరును తొలగించబోమని చెప్పి దేశాయ్‌ను శాంతింపజేశారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇరు వర్గాల నేతలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మూడు పార్టీలు కలసికట్టుగా పనిచేయాలని, విభేదాలకు దూరంగా ఉండాలని షిండే సూచించారు.

గతంలో ఈ పథకం కింద 1.59 కోట్ల మంది లబ్ధి పొందారని, రూ.4,787 కోట్లు పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద 21 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రతి నెలా రూ.1,500 బదిలీ అవుతుందని పేర్కొంది.

గొడవ దురదృష్టకరం..

ఇదిలా ఉండగా.. 'లడ్కీ బహిన్' స్కీమ్‌ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార మహాయుతి మిత్రపక్షాల మధ్య గొడవ దురదృష్టకరమని, ఇది కూటమిలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేసిందని ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకురాలు సుప్రియా సూలే పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాతే మహాయుతి ప్రభుత్వం బహిన్ (సోదరీమణులు/మహిళలు) పట్ల ప్రేమ చూపడం మొదలుపెట్టిందని ఆమె ముంబైలో విలేకరులతో అన్నారు.

‘‘లడ్కీ బహిన్ పథకం మహిళా సాధికారత కోసం తీసుకురాలేదు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెచ్చారు. క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోడానికి మంత్రులు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ఇది అన్నదమ్ముల బంధానికి అవమానం’’ అని బారామతి ఎంపీ అన్నారు.

Read More
Next Story