కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ
x

కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. ఆగస్టు 14న బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐని అనుమతిస్తూ సెప్టెంబర్ 5కి విచారణ వాయిదా వేసింది. అవినీతి కేసులో తన అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేజ్రీవాల్ సవాలు చేశారు.

ఇంతలో మంగళవారం ఢిల్లీ కోర్టు ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ జూలై 30న నాల్గో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో నిందితులుగా కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పీ శరత్ రెడ్డి ఉన్నారు. ఈ ఛార్జిషీట్ పరిశీలించిన న్యాయమూర్తి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా కోర్టు సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. నిందితులను ఆ రోజున కోర్టు ముందు హాజరుపరచాలని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశించారు.

ప్రధాన కుట్రదారులలో ఒకడైన కేజ్రీవాల్‌.. కె కవిత, రాఘవ్ మాగుంట, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు గోరంట్ల, పి శరత్ రెడ్డి, అభిషేక్ బోయిన్‌పల్లి, బెనోయ్ బాబులతో కూడిన సౌత్ గ్రూప్‌తో సంప్రదింపులు జరిపినట్లు సీబీఐ తన చార్జిషీట్ లో పేర్కొంది. కేజ్రీవాల్ సూచనల మేరకు ఈ కిక్‌బ్యాక్ నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఫండ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారని ఛార్జిషీట్ పేర్కొంది. గోవాలోని 40 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి కేజ్రీవాల్ ₹ 90 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని కూడా చార్జిషీట్‌లో సీబీఐ పొందుపరిచింది.

ఢిల్లీ ముఖ్యమంత్రిని తొలిసారిగా మార్చి 21, 2024న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. జూన్ 26న అవినీతి కేసులో CBI అరెస్టు చేసింది. మద్యం పాలసీ స్కాంతో సంబంధం ఉన్న ED కేసులో ఉన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Read More
Next Story