HECI బిల్లును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
x

HECI బిల్లును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో HECI బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్రం..


Click the Play button to hear this message in audio format

కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా HECI (Higher Education Commission of India) Bill‌ను పార్లమెంట్‌(Parliament)లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఉన్న UGC, AICTE లాంటి ప్రధాన నియంత్రణ సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే సమగ్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఆలోచన. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్లన్నింటిలో ఒకే విధానంలో నాణ్యత ప్రమాణాలు అమలు చేయడమే బిల్లు ముఖ్యోద్దేశం.


ఆందోళన ఎందుకు?

ఈ బిల్లుపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అధికారాలు కేంద్ర నియంత్రిత సంస్థ చేతిలోకి వెళ్లడం వల్ల రాష్ట్రాల పాత్ర తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి. కమిషన్‌కు అధిక అధికారం ఇవ్వడం వల్ల పరిశోధన స్వేచ్ఛ, కరికులం స్వతంత్రత లాంటి అంశాలపై ప్రభావం చూపవచ్చని విద్యావేత్తల అభిప్రాయం. అయితే భారత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకువెళ్లడం బిల్లు ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.


కమిటీ ఏం కోరుకుంటోంది?

ఈ నేపథ్యంలో సుమారు 30కి పైగా ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల సమన్వయ కమిటీ HECI బిల్లును వ్యతిరేకిస్తోంది. ముందుగా దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులు బీజేపీయేతర పార్టీ ఎంపీలను కలుస్తున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులు ఇప్పటివరకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ కనిమొళి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ ఎంపీ దీపాంకర్ భట్టాచార్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ పి. సందోష్ కుమార్‌ను కలిశారు.

"ఎవరి అభిప్రాయాన్ని తీసుకోకుండా తొందరపాటుతో బిల్లును రూపొందించారు. విద్యా వ్యవస్థలో ప్రధాన భాగస్వాములైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఈ బిల్లుపై చర్చించడానికి రాష్ట్రాలకు తగినంత సమయం కూడా ఇవ్వలేదు" అని ఎంపీలకు రాసిన లేఖలో కమిటీ పేర్కొంది.

"మీరు మా అభిప్రాయాన్ని పార్లమెంటు సభ్యుల ముందు ఉంచుతారని, బిల్లుకు వ్యతిరేకంగా జరిగే చర్చలో మాట్లాడతారని మేం ఆశిస్తున్నాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తలు తమ వాదనను వినిపించడానికి తగినంత అవకాశం కల్పించడానికి బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని మీ ద్వారా కేంద్రాన్ని కోరుతున్నాం" అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Read More
Next Story