ఆమెది నకిలీ సర్టిఫికెట్ - తేల్చేసిన ఢిల్లీ పోలీసులు
x

ఆమెది నకిలీ సర్టిఫికెట్ - తేల్చేసిన ఢిల్లీ పోలీసులు

2018 , 2021లో మంజూరయినట్లు చెబుతున్న వైకల్య ధృవీకరణ పత్రాలతో ఖేద్కర్ 2022, 2023లో యూపీఎస్పీ పరీక్షలకు దరఖాస్తు చేశారు.


ఐఏఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్ వైక్యల్య ధృవీకరణ పత్రం బోగస్ అనే తేల్చేశారు ఢిల్లీ పోలీసులు. 2022-23 యూపీఎస్సీ పరీక్షల్లో ఖేద్కర్ సమర్పించిన సర్టిఫికేట్ నకిలీదని కోర్టుకు చెప్పారు.

ఖేద్కర్ యుపిఎస్‌సి పరీక్షల కోసం రెండు వేర్వేరు వైకల్య ధృవీకరణ పత్రాలను పొందారు. వీటిపై విచారించిన పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. ఖేద్కర్‌కు వైకల్య ధృవీకరణ పత్రం జారీ చేయలేదని మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని వారి సివిల్ సర్జన్ కార్యాలయ రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆమె దగ్గర ఉన్నది నకిలీవని పోలీసులు తమ నివేదికలో కోర్టుకు తెలిపారు.

2018 , 2021లో మంజూరయినట్లు చెబుతున్న వైకల్య ధృవీకరణ పత్రాలతో ఖేద్కర్ 2022, 2023లో యూపీఎస్పీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడానికి 2022 యూపీఎస్పీ దరఖాస్తులో ఖేద్కర్ తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. ఢిల్లీ హైకోర్టు ఖేద్కర్‌కు ఆమెను అరెస్టు చేయకుండా సెప్టెంబర్ 5కు కేసు వాయిదా వేసింది.

ఇప్పటికే చర్యలు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఖేద్కర్‌పై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. జూలై 31న, UPSC ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఇకపై పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేసింది.

నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందినందుకు ఆమెపై క్రిమినల్ కేసు కూడా నమోదయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, వికలాంగుల హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఖేద్కర్‌పై ఉన్న ఆరోపణలేంటి?

మహారాష్ట్రలోని పూణే జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన 32 ఏళ్ల ఖేద్కర్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 'మహారాష్ట్ర గవర్నమెంట్' అని రాసి ఉన్న ఒక ప్రైవేట్ ఆడి కారుపై ఎరుపు-నీలం రంగు బల్బులు అమర్చుకోవడం, కింది స్థాయి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో ఆమెను విదర్భలోని వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగాన్ని పొందినట్లు వార్తలు రావడంతో ఆ దిశగా కూడా ఆమెపై విచారణ చేపట్టారు.

నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి ₹8 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే OBC నాన్ క్రీమి లేయర్ కేటగిరీలోకి వస్తారు. అయితే ఈ కోటలో ఉద్యోగం సంపాదించేందుకు ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడిగా ఉన్నారని, ఆమె తన తల్లితో నివసిస్తున్నానని చెప్పి సర్టిఫికెట్ సంపాదించారు. తండ్రి సివిల్ సర్వెంట్‌గా ఉన్నప్పుడు కుటుంబ ఆదాయాన్ని 'సున్నా'గా ఎందుకు చూపించారని అడిగినపుడు..తన తల్లిదండ్రులు విడిగా ఉన్నారని, తండ్రి సంపాదనతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

తుపాకీతో బెదిరించినందుకు తల్లి అరెస్టు..

భూ వివాదం కేసులో ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించినందుకు ఖేద్కర్ తల్లి మనోరమను పుణె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన ఆమె తండ్రి దిలీప్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.

Read More
Next Story