కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వును రిజర్వు చేసిన హైకోర్టు
x

కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వును రిజర్వు చేసిన హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ముందు కేజ్రీవాల్, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.


ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ, మధ్యంతర బెయిల్‌ కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ముందు కేజ్రీవాల్, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు CBI ప్రయత్నిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్ "ఉగ్రవాది కాదు" కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అని చెబుతూ బెయిల్‌కు అర్హుడని బలంగా వాదనను వినిపించారు. అయితే CBI తరపు న్యాయవాది DP సింగ్ కేజ్రీవాల్ రెండు పిటీషన్లను వ్యతిరేకించారు.

ఇటు కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి వాదనల కోసం హైకోర్టు జూలై 29కి వాయిదా వేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది.

మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రికి జూన్ 20న మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత 2022లో ఎక్సైజ్ పాలసీని రద్దు చేశారు.

Read More
Next Story