
హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్ కుమార్..
ఆయన మానసిక ఆరోగ్యంపై పుకార్లు..
ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి(Bihar CM) నితీష్ కుమార్(Nitish Kumar) యువ ముస్లిం ఆయుష్ వైద్యురాలు నుస్రత్ పర్వీన్ నఖాబ్ హిజాబ్ లాగడం(Hijab row) తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అసాధారణ ప్రవర్తన నితీష్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి ఆయన తగిన వ్యక్తి కాదని కొంతమంది అంటున్నారు.
ఇంతకు ఏం జరిగింది?
సీఎం చేతులమీదుగా ఆయుష్ డాక్టర్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చేందుకు డిసెంబర్ 15న ముఖ్యమంత్రి సచివాలయంలో ఒక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఆయుష్ వైద్యురాలు నుస్రత్ పర్వీన్‌కు అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తూ.. అకస్మాత్తుగా ఆమె హిజాబ్‌ను లాగారు నితీష్. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా నిర్ఘా్ంతపోయారు. సీఎం ఇలా ప్రవర్తించారేంటని ఆశ్చర్యపోయారు.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యింది. నితీష్ వెనుక నిలబడి ఉన్న బీజేపీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి హిజాబ్ లాగకుండా ఆపేందుకు ప్రయత్నించాడు. కాని ఆలోగా హిజాబ్ లాగేశాడు నితీష్. అదే సమయంలో డయాస్‌పై ఉన్న బీహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దీపక్ కుమార్, మాజీ చీఫ్ సెక్రటరీ నవ్వుతూ కనిపించడం నుస్రత్ మనసు గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె వెంటనే పాట్నా నుంచి తన కుటుంబం ఉంటున్న కోల్‌కతాకు బయలుదేరింది. డిసెంబర్ 20న ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. నుస్రత్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నితీష్ క్షమాపణ చెప్పాలి..
నితీష్ తీరుపై ముస్లిం సంస్థలు, మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఇది అతని(నితీష్) మానసిక ఆరోగ్య సమస్యను బహిర్గతం చేస్తుంది. అతను అరోగ్యంగా లేరు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడు. అతని పరిస్థితి తెలిసినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను వాడుతున్నారు’’ అని 1990 మధ్యలో సమతా పార్టీ రోజుల్లో నితీష్ కుమార్‌తో కలిసి పనిచేసిన సామాజిక-రాజకీయ కార్యకర్త కాంచన్ బాలా అన్నారు.
ఆరోగ్యంపై రాజకీయ దుమారం..
ఈ ఘటనతో ప్రతిపక్ష ఆర్జేడీ(RJD) నితీష్‌ను తీవ్రంగా తప్పుబడుతోంది. "నితీష్ జీకి ఏమైంది? అయన మానసిక స్థితి పూర్తిగా బాగోలేదు" అని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే నితీష్ వర్గీయులు, జేడీ(యు) నాయకులు ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని బహిరంగంగా ప్రకటించారు.
పాట్నాలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) మాజీ ప్రొఫెసర్ పుష్పేందర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఊహించని ప్రవర్తన కారణంగా నితీష్ కుమార్ గాసిప్‌లకు కేంద్ర బిందువయ్యారు. ఇది రాష్ట్రానికి సానుకూల పరిణామం కాదు. ఎందుకంటే అతను ప్రభుత్వ పదవిలో ఉన్నారు. నితీష్ కుమార్ మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
గత నెలలో నితీష్ ప్రధాని మోదీ పాదాలను తాకడానికి ప్రయత్నించారు. అక్టోబర్ మాసంలో ముజఫర్‌పూర్‌లో జరిగిన తన మొదటి ఎన్నికల ర్యాలీలో నితీష్ ప్రసంగం కంటే తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. 2025 అక్టోబర్‌లో ప్రధాని మోదీ హాజరైన వర్చువల్ ఫంక్షన్‌లో నితీష్ కుమార్ నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని, వాటిని కొద్దిగా ఊపుతూ కొద్దిసేపు నవ్వుతూ కనిపించారు. గతంలో నితీష్ కుమార్ ఒక అధికారిక కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి తలపై పూల కుండ ఉంచారు. ఈ సంవత్సరం మార్చిలో ఒక బహిరంగ కార్యక్రమంలో ఒక మహిళ భుజం చుట్టూ చేయి వేసి, మరొక కార్యక్రమంలో ఒక మహిళను తాకడానికి ప్రయత్నించారు. ప్రతిపక్ష నాయకులు ఈ చర్యలను విమర్శించారు. నితీష్ మానసిక ఆరోగ్యాన్ని ప్రశ్నించారు.
ఆధారాలు లేవనే..
JD(U) నాయకులు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కావడం వల్ల నితీష్ ప్రవర్తనపై మౌనం పాటిస్తున్నారు. "ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన తీరును ఖండించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు." అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నారు. అయితే ఈ వివాదంపై బీజేపీ(BJP) మౌనంగా ఉండటం గమనార్హం.

