బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారవేత్త హత్య
x

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారవేత్త హత్య

నరికి, నిప్పంటించిన దుండగులు..


Click the Play button to hear this message in audio format

బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ వ్యాపారవేత్తపై దుండగులు దాడి చేశారు. దారుణంగా నరికి, నిప్పంటించారు. గత రెండు వారాల్లో మైనారిటీ సమాజంపై జరిగిన నాలుగో దాడి ఇది. బుధవారం రాత్రి షరియత్‌పూర్ జిల్లా దాముద్యలోని క్యూర్భంగా బజార్ సమీపంలో 50 ఏళ్ల ఖోకోన్ చంద్ర దాస్‌పై దుండగులు దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు.


ఆటోను అడ్డగించి...

మందుల దుకాణం నడుపుతున్న దాస్ ప్రయాణిస్తున్న ఆటోను మార్గమధ్యంలో కొంతమంది అడ్డగించారు. దాస్‌ను బయటకు లాగి, కొట్టి, పదునైన ఆయుధాలతో నరికారు. తర్వాత తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలిసుల ప్రాధమిక సమాచారం.

అయితే తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో దాస్ రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూకాడు. ఇంతలో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు దాస్‌ను రక్షించి షరియత్‌పూర్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అధిక రక్తస్రావం, గాయాల తీవ్రత కారణంగా వైద్యుల సూచనమేరకు దాస్‌ను ఢాకాకు తరలించారు.

షరియత్‌పూర్ సదర్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో వైద్యుడు నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘దాస్ శరీరంపై చాలా గాయాలున్నాయి. పొత్తికడుపుపై ​​తీవ్రమైన గాయం, ముఖం, తల, చేతులపై కాలిన గాయాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

దాస్ భార్య సీమా దాస్ మాట్లాడుతూ.. ‘‘నా భర్తపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదు. అయితే దాడి చేసిన ఇద్దరిని నా భర్త గుర్తించాడు.’’ అని పేర్కొంది.

బాధితుడు రబ్బీ, సోహాగ్ అనే ఇద్దరి పేర్లు చెప్పాడని దాముద్య పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ మొహమ్మద్ రబియుల్ హక్ తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేసి ఇతరులను కూడా గుర్తిస్తామని ఆయన చెప్పారు.


వరుస హత్యలు..

మైమెన్‌సింగ్ నగరంలో దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ వ్యక్తిని ఒక గుంపు కొట్టి చంపి, అతని శరీరాన్ని తగలబెట్టింది. ఒక వారం తర్వాత డిసెంబర్ 24న రాజ్‌బరి పట్టణంలోని పంగ్షా ఉపజిల్లాలో దోపిడీ ఆరోపణలపై అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు.


భారత్ ఆందోళన..

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా సుమారు 13.13 మిలియన్లు. ఇది దేశ మొత్తం జనాభాలో దాదాపు 7.95%. గత కొన్ని వారాలుగా దేశంలో మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

Read More
Next Story