దళితుల్లో దళితులు కొట్లాడుకునే తీరు ఇంకెంత కాలం?
x
సుప్రీంకోర్టు

దళితుల్లో దళితులు కొట్లాడుకునే తీరు ఇంకెంత కాలం?

"ఇది వెనుకబడిన వర్గాలలో వెనుకబాటుతనానికి సంబంధించిన యుద్ధం" అన్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్..ఎస్సీ వర్గీకరణపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వే చేసింది.


అన్యాయాలు హతమారుస్తాము, అక్రమాలు పరిమారుస్తామంటే సరిపోదు, ఆచరించి చూపాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దళితుల్లో దళితులు కొట్లాడుకునే తీరుకు అడ్డుకట్ట వేయాలని అభిప్రాయపడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనే వ్యవహారమై మూడు రోజులుగా సాగిన వాదోపవాదాలు ముగిశాయి. తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దళితుల్లో అట్టడుగున ఉన్న వర్గాలకు రిజర్వేషన్ల కోటా ప్రయోజనాలను అందించడానికి షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించాలని చాలా రాష్ట్రప్రభుత్వాలు కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. ఎస్సీ వర్గీకరణ చేయకూడదంటూ 2004లో ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును రిజర్వే చేసింది.

"ఇది వెనుకబడిన వర్గాలలో వెనుకబాటుతనానికి సంబంధించిన యుద్ధం" అన్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఆయన నాయకత్వంలోని ఏడుగురు జడ్జీలలో ఏకైక దళిత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. మిగతా వారందరూ అగ్రవర్ణాల వారే. ఈ బెంచ్ లోని మిగతా న్యాయమూర్తుల్లో జస్టిస్ విక్రమ్ నాథ్, బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర ఉన్నారు. ధర్మాసనానికి సిజెఐ డి వై చంద్రచూడ్ నాయకత్వం వహిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఏమని హెచ్చరించిందంటే...

వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపినట్లయితే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అణచివేతకు గురైన వర్గాలు చాలా ఉండగా కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చే యత్నంలో ఇతరులను రిజర్వేషన్లకు దూరం చేయడం తగదని తెలిపింది. ఆ ప్రయోజనాలను కోల్పోయిన వారు రాజ్యాంగ అధికరణం 14 (సమానత్వ హక్కు) కింద ఎల్లప్పుడూ వర్గీకరణను సవాల్‌ చేస్తూనే ఉంటారని స్పష్టం చేసింది. దీని నివారణకు ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని తెలిపింది. వెనుకబాటుకు గురైన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి వర్గీకరణ ఉపకరిస్తుందని పేర్కొంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అనే అంశంపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసింది.

ఎస్సీ వర్గీకరణ కోసం 23 పిటిషన్లు...

ఈ అంశంపై దాఖలైన 23 పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వివిధ పక్షాల వాదనలను వినింది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌సిబల్‌ తదితరులు తమ వాదనలు వినిపించారు. ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు 2004లో వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందన్న ఆ తీర్పులోని అభిప్రాయంతో విభేదించారు. అదే తరహాలో 2006 పంజాబ్ చట్టాన్ని చిన్నయ్య తీర్పును ఉటంకిస్తూ పంజాబ్ హైకోర్టు కొట్టివేసింది.

వాదోపవాదనలు ఇలా సాగాయి...

అన్ని గ్రూపులు ఒకే తరహా పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయా? అని చీఫ్ జస్టిస్ ప్రశ్నిస్తూ.. ఈ ధర్మాసనం చిన్నయ్య కేసులో తీర్పు సరైనదా కాదా అనేది మాత్రమే నిర్ణయిస్తుంది. దళితులకు 15% కోటాలో వాటాల కోసం కమ్యూనిటీలను ఉప వర్గీకరిస్తూ ప్రభుత్వం రూపొందించిన చట్టాల చెల్లుబాటులోకి కూడా కోర్టు వెళ్లదని స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన వారికి కొంత శాతం కోటాను కేటాయించేందుకు శాసనసభలో అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించిన తర్వాత రాష్ట్రాలు ఆమోదించిన ఉప-వర్గీకరణ చట్టాల చెల్లుబాటును సంబంధిత హైకోర్టులు నిర్ణయిస్తాయని పేర్కొంది.

ఎస్సీలలోని కొన్ని సెక్షన్లు ఇతరులకు దక్కాల్సిన వాటాను కూడా ఉపయోగించుకుని సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినట్టు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న సంకేతాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. వర్గీకరణ లేకపోవడం వల్ల జరిగిన లోటుపాట్లను సరిదిద్దే విషయాన్ని పరిశీలిస్తామన్న సంకేతాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన ప్రాయంగా చెప్పింది.

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారి వాదన ఇలా...

ఎస్సీ జాబితాలోని అన్ని వర్గాలు ఒక్కటే, వారిని వేరు చేయడం తగదు, అలా వారిని విడగొట్టడమంటే ఈ జాతులన్నింటి మధ్య అంతఃసూత్రంగా ఉన్న ఐక్యతను, వారి ప్రాధమిక హక్కులను దెబ్బతీయడమే అని వర్గీకరణను వ్యతిరేకించిన వారి తరఫు సీనియర్ న్యాయవాదులు మనోజ్ స్వరూప్, కేఎస్ చౌహాన్, సంజయ్ హెగ్డే. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ కి న్యాయవాదులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

చంద్రచూడ్ ఏమని అడిగారంటే...

“మీరన్న మాట నిజమే గాని ఇవి గాక ఈ గ్రూపుల మధ్య ఉన్న ఉమ్మడి అంశాలేమిటని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ గ్రూపులు కూడా వివక్షను ఎదుర్కొన్నాయా అని అడిగారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, వివాహ వయస్సు, శిశు మరణాలు, ప్రసూతి మరణాల రేటు వంటి అంశాలలో అన్ని గ్రూపులు ఒకేలా ఒకేలా బాధపడ్డాయా? అని అడిగారు.

చంద్రచూడ్ వాదనకు జస్టిస్ గవాయ్ కొనసాగింపుగా.. “కమ్మర్లు, స్కావెంజర్లు ఇద్దరూ ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఈ వర్గాలు ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నాయి? అంటరాని వారిలో అంటరానివారు ఉన్నారు. విద్య, ఉద్యోగాల ప్రాప్తి విషయంలో వారందరినీ సమానంగా చూడాలా? సమానత్వాన్ని సాధించేందుకు, ఎస్సీలలోని అణగారిన వర్గాలకు గ్రేడెడ్ కోటా ప్రయోజనాలను అందించడానికి రాష్ట్రాలకు అనుమతి అవసరం.

“ఒక నిర్దిష్ట వర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన 75% సీట్లను ఆపివేస్తే, ఇతర దళిత వర్గాలకు తక్కువ సంఖ్యలో పోస్టులు మిగిలి ఉంటే, ఆర్టికల్ 15,16 ప్రకారం సామాజిక సమానత్వాన్ని సాధించడానికి మరింత సమానమైన పంపిణీ కోసం ఉప-వర్గీకరణ కోటాను రాష్ట్రాలు కొరడాన్ని నిరోధించాలా?" అని ప్రశ్నించారు.

3 రోజుల విచారణ సమయంలో, వెనుకబడినవారిలో అభివృద్ధి చెందిన వారిని తొలగించడానికి 'క్రీమీ లేయర్' సూత్రం యొక్క దరఖాస్తును జస్టిస్ గవాయ్ క్లుప్తంగా స్పృశించారు, ఒక రకమైన వడపోత అవసరమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా ‘క్రీమీలేయర్’ సూత్రం వర్తిస్తుందని 2018లో ఎస్సీ తీర్పు ఇచ్చినప్పటికీ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అడ్మిషన్ల విషయంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ నోటిఫికేషన్ తీసుకురాలేదన్నారు.

Read More
Next Story