‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్' అంటున్నదెవరు?
గత వారం జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీని మరింత నిరాశకు గురిచేశాయి. మూడు స్థానాల్లోనూ టిఎంసి అభ్యర్థులు గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలలో మైనార్టీ వర్గాల నుంచి అనుకున్నంత మద్దతు లభించలేదని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి పేర్కొన్నారు. అందుకే ‘సబ్కా సాత్, సబ్‌కా వికాస్’కు బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్' (మేము మనతో ఉన్నవారితో ఉన్నాం)’ అని ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ మైనారిటీ మోర్చా అవసరాన్ని కూడా తోసిపుచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఓటర్లలో మైనారిటీలు దాదాపు 30 శాతం ఉన్నారు. 2014లో బీజేపీ నినాదం ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ కాగా, 2019లో ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ గా పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో "చాలా ప్రాంతాలలో టిఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులను ఓటు వేయడానికి అనుమతించలేదు" అని సువేందు ఆరోపించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం సాధ్యం కాదు.. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అందుకు అనుమతించరు. రాష్ట్రంలో డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్‌ను అమల్లోకి తేవడం ద్వారానే ప్రశాంత ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా పాలన పగ్గాలు చేపట్టాలనుకోవడం లేదు. ప్రజల ఆమోదంతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తాం.’’ అని పేర్కొన్నారు.
ఫలితానివ్వని ఫలితాలు..
గత వారం జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీని మరింత నిరాశకు గురిచేశాయి. మూడు స్థానాల్లోనూ టిఎంసి అభ్యర్థులు గెలుపొందారు. ఇక పార్లమెంటు ఎన్నికలలో కూడా బీజేపీ సత్తా చాటలేకపోయింది. 2019లో బిజెపి 18 స్థానాల్లో గెలుపొందితే.. ప్రసుత్తం 12కి పడిపోయింది.
సువేందు వ్యాఖ్యలపై TMC నాయకుడు కునాల్ ఘోష్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత తమ సొంత క్యాడర్ కాపాడుకునేందుకు బీజేపీ నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు.