Delhi Politics | BJP అధికారంలోకి వస్తే AAP పథకాలన్నీ కొనసాగిస్తాం
‘ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పథకాలను ఆపేస్తారని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు.’ - రాంవీర్ సింగ్ బిధూరి
ఢిల్లీలో తాము అధికారంలోని వస్తే ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని BJP మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాంవీర్ సింగ్ బిధూరి చెప్పారు. ఇప్పటికే దేశ రాజధానిలో 200 యూనిట్ల విద్యుత్, 20,000 లీటర్ల నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే కాషాయ పార్టీ నేతల మాటల నమ్మి మోసపోవద్దని ఆప్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘వాళ్లు (బీజేపీ) పొరపాటున కూడా అధికారంలోకి వస్తే.. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నింటిని రద్దు చేస్తారు. గతంలో మా పథకాలను పూర్తిగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మా పథకాలు లేవు. మా పథకాలను కాపీ కొట్టి మేం వాటిని కొనసాగిస్తామని చెప్పడం విచిత్రంగా ఉంది. అలాంటప్పుడు బీజేపీని ఎన్నుకోవడం దేనికి? AAP నే జనం ఎన్నుకుంటారు. కేజ్రీవాల్ చెప్పారు. చేసి చూపించారు కూడా.." అని ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆప్.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..
‘ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతోన్న పథకాలను ఆపేస్తారని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత మా మేనిఫెస్టో ప్రకటిస్తాం. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో వివిధ వర్గాల ప్రజలను మా పార్టీ నాయకులు కలుస్తారు. సీనియర్ నేతలు మేనిఫెస్టో కమిటీ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. వారికి బాధ్యతలు కూడా అప్పగించారు. పర్వేష్ వర్మ (చాందినీ చౌక్), అరవిందర్ సింగ్ లవ్లీ (న్యూఢిల్లీ), సతీష్ ఉపాధ్యాయ్ (తూర్పు ఢిల్లీ), అజయ్ మహావార్ (ఈశాన్య ఢిల్లీ), కైలాష్ గహ్లోట్, అభిషేక్ టాండన్ (దక్షిణ ఢిల్లీ), కేంద్ర మాజీ మంత్రులు హర్షవర్ధన్, విజయ్ గోయెల్ (నార్త్ వెస్ట్ ఢిల్లీ)కి ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారు. ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు జిల్లాలకు వీడియో వ్యాన్‌లను పంపుతున్నాం. వీటిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా శనివారం జెండా ఊపి ప్రారంభిస్తారు. మాజీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మేనిఫెస్టో కమిటీ కార్యకలాపాలను మోనిటర్ చేస్తారు. మానిఫెస్టో సూచనల కోసం మా ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, హ్యాష్‌ట్యాగ్ #bjpsankalp2025 విడుదల చేస్తున్నాం.’’ అని వివరించారు. ప్రస్తుత పథకాలకు అదనంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం అమలపై కూడా తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని బిధూరి విలేఖరులకు చెప్పారు.
70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.