పదేళ్లుగా ‘ప్రధాని’ మీడియా సమావేశమే నిర్వహించలేదు
దేశంలో ప్రధాని మీడియా సమావేశం నిర్వహించి పదేళ్లు పూర్తి అయిందని ప్రముఖ జర్నలిస్టు పంకజ్ పచౌరీ అన్నారు.
చివరి సారిగా భారత ప్రధాని హోదాలో జనవరి 3,2014న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారన్నారు.ఈ సమావేశంలో ప్రధాని కార్యాలయానికి దాదాపు 100 కి పైగా జర్నలిస్టులను అనుమతించినట్లు పేర్కొన్నారు. దాదాపు 62 ప్రశ్నలకు మన్మోహన్ సమాధాన మిచ్చారని పంకజ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓపోస్ట్ పెట్టారు. ఈ పోస్టు దేశ రాజకీయపరిస్థితులపై చర్చకు దారి తీసింది. మాజీ ప్రధాని మన్మోహన్ పదవిలో ఉండగా నిర్వహించిన మీడియా సమావేశం వీడియోను ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.
The last press conference by an Indian PM was held exactly 10 years ago today.
— Pankaj Pachauri (@PankajPachauri) January 3, 2024
62 unscripted questions answered with 100+ journalists present.
- https://t.co/kxm4o2Wyc0 pic.twitter.com/R7vfBHNzWg
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, మన్మోహన్ ను మౌన ప్రధానిగా ముద్ర వేసిందని ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అలాగే ప్రస్తుతం ప్రతిపక్షాలు మీడియా సమావేశాలు నిర్వహించడం లేదనే ప్రధాని విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ను ‘ఎక్స్ లో ’ పంచుకున్నారు. ‘ నేను మీడియాకు భయపడటం ఏమిటీ, నేను భారత ప్రధానిని’అని ఆయన అంటున్న మాటలు అందులో ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత నరేంద్రమోడీ కనీసం ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని, ప్రశ్నలు లేవు జవాబులు లేవని పంకజ్ విమర్శిస్తున్నారు.
2014 నాటి మన్మోహన్ మీడియా సమావేశంలో ఏం అన్నారంటే..
మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో 2014,జనవరి 3న మీడియా సమావేశం నిర్వహించారు. తన దశాబ్ద పాలన విజయాలు, వైఫల్యాలపై సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. ‘దేశంలో వృద్దిరేటు 9.0 శాతానికి చేరడంపై నిజంగా సంతోషం, మేము సమ్మిళిత వృద్దిని సాధించాం. దేశంలోని ప్రజలందరిని ప్రగతిపథంలోకి తీసుకొచ్చాం’ అని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ భారతం ఆర్థికంగా బలోపేతం చేయడం పై దృష్టి పెట్టినట్లు మన్మోహన్ చెప్పారు. దానికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పంటలకు మద్ధతుధరలు పెంచడం, రైతులకు ఇచ్చే రుణ పరిమాణం పెంచడంతో పాటు అందరికి అందేలా తీసుకున్న చర్యలు, అలాగే గ్రామీణ మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను ప్రజలకు అందించామని చెప్పారు. తమ ప్రభుత్వం మెరుగైన పాలనతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 13.8 కోట్లకు తగ్గిందని మన్మోహన్ సింగ్ ఆనాటి మీడియా సమావేశంలో చెప్పారు.
విద్యారంగంలోని అందరికి విద్య అందేలా సర్వశిక్ష అభియాన్, కొత్త విశ్వవిద్యాలయాలు, కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలు నెలకొల్పమన్నారు. మైనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు స్కాలర్ షిప్లు అందజేసినట్లు తన ప్రగతి నివేదికలో పేర్కొన్నారు.
అలాగే తన ప్రభుత్వ వైఫల్యాలను సైతం ప్రధాని హోదాలో ఆయన అంగీకరించారు. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమవడంతో పాటు పాటు వివిధ కుంభకోణాలపై విచారం వ్యక్తం చేశారు. ‘2జీ కుంభకోణం, బొగ్గు గనుల వేలంలో మేము పలు లోపాలను గుర్తించాం, ఇలాంటివి భవిష్యత్ లో తలెత్తకుండా చూసుకుంటాం’ అని ప్రధాని హోదాలో మన్మోహన్ హామీ ఇచ్చారు. అలాగే విదేశాలతో సత్సంబంధాలపై కూడా ప్రధాని వివరణ ఇచ్చారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఒకే ఒక్క మీడియా సమావేశం నిర్వహించారు. అది కూడా అమెరికా వైట్ హౌజ్ లోని అని పంకజ్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటానికి ఇష్టపడతారు. ప్రతి నెల మన్ కీ బాత్ నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ మీడియాను ఎదుర్కొవడానికి ఇష్టపడరు’అని అప్పట్లోనే న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. పంకజ్ డిబెట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనీష్ తివారీ సైతం ఓ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో 117 సార్లు మీడియాతో మాట్లాడారు. కానీ నరేంద్ర మోడీ తన పదవీ కాలంలో ఎన్ని మీడియా కాన్ఫరెన్స్ లు నిర్వహించారు అని ట్వీట్ చేశారు.
పంకజ్ పచోరీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహదారుగా ఉన్నారు. అలాగే ఎన్డీటీవీ, బీబీసీ లాంటి సంస్థలలో పని చేశారు.