చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక?
లోక్ సభ లో స్పీకర్ పదవి కోసం ఇండిపెండెన్స్ తరువాత తొలిసారిగా ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ పదవి కోసం ప్రతిపక్ష ఇండి కూటమి, ఎన్డీఏ లు తమ అభ్యర్థులను..
పార్లమెంట్ లో తొలిసారిగా అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడంతో స్పీకర్ పదవి ఎన్నిక కోసం తమ తరఫున కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ ను ఇండి కూటమి బరిలోకి దింపింది. గత లోక్ సభ స్పీకర్ గా ఉన్న ఓం బిర్లానే మరోసారి అధికార ఎన్డీఏ బరిలోకి దింపే అవకాశం ఉంది. దీంతో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవి కోసం ఓటింగ్ జరగడం అనివార్యంగా మారింది. ఇప్పటి వరకూ జరిగిన 17 లోక్ సభ ల్లో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
1946 తరువాత స్పీకర్ పదవి కోసం లోక్ సభ లో ఎన్నిక జరగలేదు. సురేష్ నామినేషన్‌ను ప్రతిపక్ష ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ ప్రకటించారు. కేరళలోని మావెలికర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీ కొడికున్నిల్ సురేష్ ప్రస్తుత లోక్‌సభలో అత్యంత సీనియర్ ఎంపీ. దళిత వర్గానికి చెందిన సభ్యుడు, ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయనను బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ "తెలివైన" వ్యక్తిగా అభివర్ణించారు.
రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి గెలుపొందిన బిర్లా, లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తారనే సూచనల మధ్య ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
ప్రధాని మాటలను దేశం విశ్వసించదు
అంతకుముందు రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపక్షానికి కేటాయిస్తే, ఓం బిర్లా ఎన్నికకు తాము ఏకగ్రీవంగా మద్ధతు ఇస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసి కాంగ్రెస్ మద్దతు కోరారని రాహుల్ చెప్పారు.
తనను మరోసారి పిలిచి మాట్లాడతామని కూడా ఖర్గే కు, రాజ్ నాథ్ చెప్పారని, కానీ ఇప్పటి వరకూ ఆయనకు మళ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇది ఆయనను అవమానించడమే అని రాహూల్ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలు సహకరించాలని అంటారు..కానీ ఆయన మాత్రం విపక్షాలకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని అన్నారు.
యూపీఏ హయాంలో ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మాటల్లో ఒకటి చెప్తారని, చేతల్లో ఒకటి చేస్తారని, ఆయన మాటలను దేశం విశ్వసించదని అన్నారు. రాజస్థాన్‌లోని కోటా సీటును నిలబెట్టుకోవడం ద్వారా, గత 20 ఏళ్లలో దిగువ సభకు తిరిగి ఎన్నికైన మొదటి ప్రిసైడింగ్ అధికారిగా బిర్లా నిలిచారు.
Next Story