
బీహార్‌లో సీట్ షేరింగ్ ఇంకాస్త ఆలస్యం?
తొలుత సెప్టెంబర్ 15 నాటికి సీట్ల కేటాయింపుపై ఒక నిర్ణయానికి రావాలని పార్టీలు భావించాయి. కాని పరిస్థితులు చూస్తుంటే ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీహార్(Bihar)లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (S.I.R)ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ (Congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్రంలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’(Voter Adhikar Yatra) చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ప్రతిపక్ష సంకీర్ణంలో సీట్ల పంపకాలపై విభేదాలు, అసంతృప్తి బయటపడతున్నాయి.
సీట్ల పంపకాల చర్చల సందర్భంగా రాష్ట్రంలోని డజనుకు పైగా నియోజకవర్గాలను మిత్రపక్షాలకు కేటాయించడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. అయితే ఇవన్నీ ఎన్నికల ముందు సాధారణమే అని మహా కూటమి నాయకులు చెబుతున్నారు. కూటమి స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపవని అంటున్నారు. కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లకు నియోజకవర్గాల కేటాయింపు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అధికార NDAలోనూ గొడవలే..
అయితే సంకీర్ణ అధికార NDAలోనూ సీట్ల సర్దుబాటుపై ఇలాంటి విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. NDA కూటమి ప్రధాన మిత్రుడయిన JD(U).. ఈ సారి BJP కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే లోక్ జనశక్తి పార్టీ - రామ్ విలాస్, హిందూస్తాన్ అవామ్ మోర్చా, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా వంటి చిన్న పార్టీలు కూడా సీట్లకు డిమాండ్ చేస్తున్నాయి. తొలుత సెప్టెంబర్ 15 నాటికి సీట్ల కేటాయింపుపై ఒక నిర్ణయానికి రావాలని పార్టీలు భావించాయి. కాని పరిస్థితులను చూస్తుంటే ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'సిట్టింగ్ సీట్ల' విషయంలో..
సీట్ల పంపకాల విషయంలో నియోజకవర్గాల మధ్య గొడవ తగ్గించడానికి.. అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతి పార్టీకి ఉన్న సీట్లు ఆ పార్టీలకే కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ లెక్కన రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాలకు గాను NDA సంకీర్ణంలోని 129 స్థానాలపై మాత్రమే చర్చలు జరుగుతాయి.
బుధవారం (సెప్టెంబర్ 10) ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ బీహార్ ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవారు "గెలవగల, గెలవలేని స్థానాల"ను గురించి వివరించారు. ఏ మిత్రపక్షమైనా గెలిచే సీట్లనే ఆశించాలని కోరారు. న్యాయమైన ఫార్ములా సాధించాలంటే “అన్ని పార్టీలు కొన్ని సీట్లు వదులుకోక తప్పదని, కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, వారికీ కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.