
బీహార్ ఓటర్ లిస్ట్‌ను అప్‌డేట్ చేయనున్న ఎలక్షన్ కమిషన్
"మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలు)ను ఓడించేందుకు బీజేపీ..ఈసీతో చేయిస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్న భారత కూటమి నేతలు..
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) పేరిట ఓటరు జాబితాను అప్‌డేట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ భావించింది. ఈ మేరకు ఓ సర్య్కూలర్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం 1987 తర్వాత జన్మించిన వారు ఓటరుగా నమోదు చేసుకోడానికి వారి బర్త్ సర్టిఫికేట్‌తో పాటుగా తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని భారత కూటమి(I.N.D.I.A)లోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నాయి. SIR వల్ల బీహార్‌లో 8 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 20 శాతం మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. కూటమిలోని ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, ఎన్‌సీపీ-ఎస్పీ పార్టీల తరుపున 20 మంది సభ్యుల బృందం SIRపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ అపాయింట్‌మెంట్ కోరింది. అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో నిన్న వారంతా నిర్వాచన్ సదన్‌లోని ఈసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కొంతమందిని మాత్రమే సమావేశానికి అనుమతించారు. పార్టీ అధ్యక్షులు లేదా వారి అనుమతి పొందిన నాయకులను మాత్రమే లోపలికి వెళ్లనిస్తామని చెప్పడం పూర్తిగా అప్రజాస్వామికమని సీనియర్ కాంగ్రెస్ (Congress) నాయకుడు అభిషేక్ మను సింఘ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బృంద సభ్యులకు, ఈసీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. చివరకు ప్రతి పార్టీ నుంచి ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, పవన్ ఖేరా, బీహార్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో సింఘ్వీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, సీపీఐ-ఎంఎల్ఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య SIRపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. SIR నిర్వహిస్తే లక్షలాది బీహార్ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సింగ్వి ఉటంకించారు. ఓటు హక్కు కోసం ఇప్పుడు పేదలు, నిరక్షరాసులు, వలస కూలీలు వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలని మీరు ఆశిస్తున్నారా? అని అడిగారు.
దాదాపు 20 శాతం మంది ఓటు హక్కు కోల్పోతారు..
"పనుల కోసం బీహార్ ఓటర్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఇలా వెళ్లిన వారు 20 శాతం కంటే ఎక్కువగానే ఉంటారు. ఈసీ ఇచ్చిన నెల గడువులోపు కొత్తగా వాళ్లు ఓటరుగా నమోదుచేసుకోలేరు’’ అని సీపీఐ నేత భట్టాచార్య ECకి చెప్పినట్లు తెలిసింది.
బిహారీ వలసదారులను అటుంచితే.. వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంతమంది స్థానికతకు సంబధించిన పత్రాలను కోల్పోయి ఉండవచ్చు. వాళ్ల పరిస్థితి ఏమిటని బృంద సభ్యులు ప్రశ్నించారు. "బీహార్‌లో మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్ష కూటమి)కు ఓటు వేయాలని చూస్తున్న ఓటర్లను తొలగించడానికే బీజేపీ ఈసీతో ఈ పనిచేయిస్తుందని ఆరోపించారు. మొత్తం మీద కూటమి సభ్యులు ఎన్నికల ముగిసేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ECని కోరారు.
ఈసీ ఏమంటుంది?
అయితే ఎన్నికల సంఘం వాదన మరోలా ఉంది. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాపై చాలా ప్రశ్నలు లేవనెత్తింది ప్రతిపక్షమేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
సామూహిక ఆందోళనలు..
‘‘SIR నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే సామూహిక ఆందోళనకు దిగుతాం.ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. బీహార్‌లో SIR అమలయితే ఇతర రాష్ట్రాల్లోనూ దీన్నే అనుసరిస్తారు." అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ది ఫెడరల్‌తో చెప్పారు.