"భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతాం."
బడ్జెట్ - 2025 ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session) ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
సమావేశాల ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘ఈ సారి బడ్జెట్(Budget)లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీపై గృహ రుణాలు ఇస్తున్నాం. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్లమందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారికత కల్పిస్తున్నాం. 3 కోట్ల మందిని లక్‌పతీ దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత మెట్రో నెట్‌వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది,’’ అని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వివరించారు.