
‘పాక్‌కు అప్పు ఇవ్వొద్దు’
పునరాలోచించాలని IMFను కోరిన కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
పాకిస్థాన్(Pakistan)కు అప్పు ఇచ్చే ముందు పునరాలోచించుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని కోరారు. గురువారం శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్‌లో సైనికులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పాక్ అణ్వాయుధ సామగ్రిని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకురావాలని రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే.
‘ఎక్కువ భాగం ఉగ్ర కార్యకలాపాలకే..’
"అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చే నిధుల్లో పాకిస్థాన్ ఎక్కువ భాగాన్ని తన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఖర్చు చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ దేశానికి నిధులు మంజూరు చేయడానికి ముందు పునరాలోచించండి, " అని రాజ్‌నాథ్ IMFను కోరారు.
పాకిస్తాన్‌కు 1 బిలియన్ డాలర్లు, రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ (RSF) కింద మరో 1.3 బిలియన్ డాలర్ల ఇచ్చేందుకు శుక్రవారం జరిగిన IMF బోర్డు సమావేశం ఆమోదించింది. సరిహద్దు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని నిరసిస్తూ భారతదేశం ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయింది.
ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విషయం కూడా విధితమే. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని ఉగ్ర స్థావరాలను దాడులు చేయడంతో సుమారు 100 మందికి పైగా ఉగ్రమూకలు చనిపోయిన విషయం తెలిసిందే.