హర్యానాలో కాంగ్రెస్ ఒంటరిపోరేనా? ఆప్‌తో పొత్తుపై సెల్జా ఏమన్నారు?
x

హర్యానాలో కాంగ్రెస్ ఒంటరిపోరేనా? ఆప్‌తో పొత్తుపై సెల్జా ఏమన్నారు?

"మేము జాతీయ స్థాయిలో భాగస్వాములం. రాష్ట్రాల విషయంలో పార్టీలు సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. కాంగ్రెస్ బలంగా ఉందని భావిస్తున్నా.’’-సెల్జా


ఒంటరి పోరు కంటే కలిసి పోరాడితే విజయం సాధించగలమన్నది కాంగ్రెస్ విశ్వాసం. ప్రాంతీయ పార్టీలు కలయికలో కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. పొత్తును కంటిన్యూ చేస్తూ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. కూటమికి ఆశించిన ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ డేట్ ఫిక్స్ చేసింది. మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1 వతేదీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల పొత్తు విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పొత్తుకు దూరంగా ఉండనుంది. ఒంటరిగానే బరిలో దిగుతానంటుంది. దీనిపై హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు కుమారి సెల్జా క్లారిటీ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా, అద్భుతమైన మెజారిటీగా సాధిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితి ఉండదని పాత్రికేయుల ఇంటరాక్షన్‌లో ధీమాగా చెప్పారు. జననాయక్ జనతా పార్టీ (జెజెపి) బలహీనపడిందని, ఆ పార్టీ గెలిచే అవకాశం లేదని సెల్జా నొక్కిచెప్పారు.

‘JJP పట్టు కోల్పోయింది.’

"జేజేపీ ప్రాబల్యం తగ్గింది. ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పటికే ఆ పార్టీని వీడారు. పార్టీకి ప్రజాదరణ కూడా లేదు. గత ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు" అని విలేఖరులతో అన్నారు. ఐఎన్‌ఎల్‌డి-బిఎస్‌పి కూటమిని కూడా ఆమె కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు చాలా ప్రాబల్యాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు.

రాష్ట్రాల్లో నిర్ణయం పార్టీలదే..

"మేము జాతీయ స్థాయిలో భాగస్వాములం. ప్రతి రాష్ట్రాల విషయంలో పార్టీలు సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. కాంగ్రెస్ బలంగా ఉందని నేను భావిస్తున్నా.’’ అని స్పష్టం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయి?

అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో తలపడగలరా? అని అడిగిన ప్రశ్నకు.. ‘మేం 90 స్థానాల్లో పోరాడతాం. మాకు ప్రతి సీటు ముఖ్యమే. వీలైనంత ఎక్కువ స్థానాలు గెలుపొందడమే మా ధ్యేయం’ అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధ హామీ, అగ్నిపథ్ సైనిక నియామక పథకాన్ని ఉపసంహరించడం మా ప్రధాన అజెండా అని చెప్పారు సెల్జా.

Read More
Next Story