కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ కారణమా? లేక, కమలం వ్యూహమా?
x

కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ కారణమా? లేక, కమలం వ్యూహమా?

పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా బీజేపీ ఢిల్లీని కైవశం చేసుకుంది. సుమారు 28 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయజెండా ఎగిరింది.


పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా బీజేపీ ఢిల్లీని కైవశం చేసుకుంది. సుమారు 28 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయజెండా ఎగిరింది. అవినీతి వ్యతిరేక పార్టీ ఆప్ ప్రతిపక్షానికి పరిమితం కాగా సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీలో ఖాతాను తెరవలేకపోయింది. ఆప్, కాంగ్రెస్ దుస్థితికి స్వీయమానసిక ధోరణలు కారణం కాగా వారి స్వయంకృతాపరాధాలు బీజేపీకి కలిసివచ్చాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- 2025 వెలువడ్డాయి. దశాబ్ద కాలానికి పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ విషమపరిస్థితిని ఎదుర్కొన్నారు. ఫిబ్రవరి 8న ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్థాపించినప్పటి నుంచి ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రాజకీయ సవాళ్లలో ఈ ఎన్నికలు ఒకటి.
28 ఏళ్లుగా దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా దూకుడుగా వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు అమిత్ షా వరకు ప్రతి నాయకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం వంటి రాజకీయ పక్షాల నేతల్ని కూడా బరిలోకి దించి సామభేదదాన దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు. బీజేపీ వ్యూహానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమికి తోడ్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద బీజేపీ సుదీర్ఘకల నెరవేరింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుంది.
దేశంలోని 28 రాష్ట్రాలలో గెలుపు ఒక ఎత్తయితే దేశ పరిపాలనా కేంద్రమైన ఢిల్లీలో తిష్టవేయడం మరో అంశం. దశాబ్దాలుగా బీజేపీని వెంటాడుతున్న ఈ శంక ఇప్పుడు తీరింది. ఈ ఫలితాలు ఢిల్లీలో AAP భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి సారించిన దాని పాలనా నమూనా, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత మధ్యతరగతి ఓటర్లను ప్రభావితం చేసింది.
ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ తన పంతం నెగ్గించుకోవచ్చు గాని దేశవ్యాపిత ఇమేజ్ ను తగ్గించుకున్నట్టయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా పేరిట కూటమిని పెట్టి కమలనాథులను ఢీ కొంటున్న ఆప్ పార్టీని తనలో ఇముడ్చుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదం. ఫలితంగా ఆ పార్టీతో పాటు ఆప్ ను కూడా నష్టపోయింది. సర్దుబాటు తత్వం లేకపోవడంతో బీజేపీ వ్యతిరేక ప్లాట్ ఫారంపైన ఉన్న ఈ రెండూ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఓ పార్టీ అధికారానికి దూరమైతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తన అస్తిత్వాన్నే నిరూపించుకోలేకపోయింది. పెద్దమనసుతో చిన్న పార్టీలను ఆహ్వానించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడంలో విఫలమైంది. ఈ రెండు పార్టీల వ్యక్తిగత ప్రతిష్ఠ, అహంభావం కూడా బీజేపీకి బాగా తోడ్పడ్డాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆప్‌కు మద్దతు ఇచ్చింది. టీఎంసీ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. "ఆప్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, బీజేపీ ఓడిపోతుందని మేము ఆశిస్తున్నాం. ఢిల్లీ ప్రజలు బీజేపీని ఓడిస్తారు" అని టీఎంసీ ఆశాభావాన్నీ వ్యక్తం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతుగా నిలిచిన రెండవ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్.
అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి మద్దతు ప్రకటించారు. "ఆప్ ప్రభుత్వం పనిచేసిన తీరును బట్టి, వారికి ఇక్కడ పనిచేయడానికి మరో అవకాశం లభించాలని మేము భావిస్తున్నాము" అని అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో జరిగిన ఆప్ "మహిళా అదాలత్" ప్రచారంలో అఖిలేష్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌కు కాకుండా ఆప్‌కు మద్దతు ఇస్తుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
చిత్రమేమిటంటే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలే. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో తన స్థానమేమిటో తెలిసినప్పటికీ కాంగ్రెస్‌ రాజకీయ ఒంటరితనం వైపే మొగ్గింది. అయితే ఆ పార్టీకి ఈ విధానం కొత్తేమీ కాదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఈ వైఖరిని అనుసరించింది. పరాజయాల పాలైంది. ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పక్షాల నుంచే బలమైన సవాలును ఎదుర్కొంది. మమతా, అఖిలేష్ తీసుకున్న వైఖరి ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో అనేక ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు వివిధ అంశాలపై కాంగ్రెస్‌తో బహిరంగంగా విభేదించాయి.
ఢిల్లీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, కోల్పోయిన రాజకీయ ప్రభావం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు గాని ఆకాశానికి నిచ్చెన వేయడంలోనే చిక్కంతా వచ్చింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. దాని ఓట్ల శాతం దారుణంగా పడిపోయింది. అనేక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, ఇటీవల ఓటర్లను ఆకర్షించే ధోరణికి అనుగుణంగా ఢిల్లీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను హామీ ఇచ్చింది.
ఢిల్లీలో తన ఉనికిని చాటుకోవడానికి భారీ ప్రయత్నం అవసరమే గాని బీజేపీపై పెట్టాల్సిన దాడిని గాంధీ కుటుంబంతో సహా దాని సీనియర్ నాయకులు ఆఫ్ పై ప్రయోగించడం. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్‌పై పూర్తి స్థాయిలో దాడి చేసింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) గ్రూపు లాంటివి ఈ ధోరణిని పసిగట్టి హెచ్చరించాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న తీవ్రమైన పోరాటంపై శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో, దేశంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం జరగాలని అన్నారు.
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ భవితవ్యాన్ని 1.5 కోట్ల మందికిపైగా ఉన్న ఓటర్లు నిర్ణయించారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత ఎన్నికల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా భారీ విజయాలు సాధించింది. 2015లో 70 స్థానాల్లో 67, 2020లో 62 స్థానాలు కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) 2020లో కొంత మెరుగై ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈసారి ఈ మూడు ప్రధాన పార్టీలు బరిలోకి దిగినా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే జరిగింది.
పిట్టల పోరు పిల్లి తీర్చినట్టు ఆఫ్, కాంగ్రెస్ మధ్య కొట్లాట బీజేపీకి లాభించింది. ప్రస్తుతం వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ కు వచ్చిన 8 శాతం ఓట్లు ఆప్ కి పడితే కేజ్రీవాల్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేది. బీజేపీ తీరును ఎండగట్టడానికి ఈ రెండు పార్టీలకు ఆస్కారం వచ్చి ఉండేది. ఇప్పుడు బీజేపీ ఆ పాత్ర పోషిస్తుంది. ఈ రెండు పార్టీలను దునుమాడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతాయే తెరవలేకపోయిందని ఎద్దేవా చేయడానికి అవకాశం వచ్చింది. ఆప్ తో కలిసి పోటీ చేసి ఉంటే అసెంబ్లీలో కనీసం ఖాతాలో తెరవడానికైనా ఛాన్స్ ఉండేది. అందుకేనేమో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని..
భిన్న వాదనలు...
ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC) వంటి పార్టీలు కాంగ్రెస్‌ను కాదని ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ తన స్వంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు, ఆప్, కాంగ్రెస్ మధ్య చీలిపోయాయి. ఈ ఓట్ల విభజన బీజేపీకి లాభంగా మారింది. ఆప్ ఓటమికి కేవలం కాంగ్రెస్ కారణమనే చెప్పడం సరికాదు. ఆప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా లిక్కర్ స్కాం వంటి అంశాలు, ఆ పార్టీపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అదేవిధంగా, బీజేపీ తన ప్రచారంలో పూర్వాంచల్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. కాబట్టి, ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమని చెప్పడం కంటే, వివిధ అంశాల సమ్మిళిత ప్రభావం కారణంగా ఆప్ ఓటమి చెందిందని చెప్పడం సముచితం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి:
ఓట్ల విభజన: కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు, ఆప్ నుంచి కొంత మేరకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా బీజేపీకి లాభంగా మారింది.
ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు: లిక్కర్ స్కాం, అవినీతి ఆరోపణలు, అరెస్టులు—ఇవి ఆప్ నేతలపై ప్రజల్లో కొంత నెగటివ్ ఇమేజ్‌ను కలిగించాయి. అవినీతి ఆరోపణలు నిజమా కాదా అన్నదాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉన్నా, రాజకీయంగా ఇది ఆప్‌కు నష్టం కలిగించింది.
బీజేపీ వ్యూహం & మోడీ ప్రభావం: బీజేపీ హిందూత్వ బ్రాండ్, మోడీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం—ఇవి కొంతవరకు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేశాయి.
Read More
Next Story