‘భద్రత లేని పాఠశాలల్లో చదువు అవసరమా?’
పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కానపుడు 'విద్యా హక్కు' గురించి మాట్లాడి ప్రయోజనం ఏమిటి?" అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది.
అసురక్షిత పాఠశాలలో చదువు అవసరమా? అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఈ రకంగా స్పందించింది. బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల విద్యార్థినులపై మగ అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు 12, 13 తేదీల్లో ఈ ఘటన జరగ్గా..16న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు నిందితుడిని 17న అరెస్ట్ చేశారు. ఈ కేసును
బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివ్‌రాజ్ చవాన్ ‘‘ఘటన దిగ్భ్రాంతికరం" అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో విద్యా హక్కు ప్రయోజనాన్ని వారు ప్రశ్నించారు. పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కానపుడు 'విద్యా హక్కు' గురించి మాట్లాడి ప్రయోజనం ఏమిటి?" అని ప్రశ్నించారు.
ఘటన గురించి పోలీసులు ఆలస్యంగా స్పందించడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యజమాన్యంపై ఫోక్సో చట్టం కింద ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున కేసుకు హాజరయిన అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్‌ను ప్రశ్నించారు. ఇప్పుడే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పినా.. న్యాయమూర్తులు సంతృప్తి చెందలేదు.
‘బాధితులకు అండగా ఉండాలి’
బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండేలా చూడాలని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అదే సందర్భంగా ప్రజలు పోలీసు వ్యవస్థపై లేదా న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఘటనల్లో తక్షణమే స్పందించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలికలకు ప్రభుత్వం కౌన్సెలింగ్ ఇప్పించిందా లేదా అని ప్రశ్నించింది.
‘27లోగా పూర్తి నివేదికతో రావాలి’
ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన నివేదికను ఆగస్టు 27లోగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బాలికల వాంగ్మూలాలు, వారి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ పూర్తి నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. బద్లాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో, రెండో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందో కూడా నివేదికలో పేర్కొనాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
రెండో అమ్మాయి వాంగ్మూలం తీసుకునేందుకు బద్లాపూర్ పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మాకు దిగ్భ్రాంతి కలిగిస్తోందని ధర్మాసనం పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగినట్లు తెలిస్తే.. పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని కోర్టు పేర్కొంది.
నిందితుడికి ఆగస్టు 26 వరకు కస్టడీ..
ఇద్దరు విద్యార్థినులపై మగ అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై మంగళవారం బద్లాపూర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇటు నిందితుడి కస్టడీని ఆగస్టు 26 వరకు పొడిగించింది కోర్టు.