కేరళలో కుంకుమపువ్వు పండుతుందా?
కుంకుమ పువ్వు పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తుకువచ్చేది కాశ్మీర్. ఈ పంటను దక్షిణాదిలో కూడా సాగుచేయవచ్చని అని శాస్త్రవేత్తలంటున్నారు.ఎలాగే చూద్దాం..
కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని కాంతల్లూర్.. ఈ గ్రామం మున్నార్ హిల్ స్టేషన్ నుంచి 48 కి.మీ దూరంలో ఉంటుంది. కాశ్మీర్‌కు సమానమైన వాతావరణ పరిస్థితులను ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సౌత్ ఇండియా కాశ్మీర్‌గా పిలుస్తారు.
ఇడుక్కి జిల్లాలోని కాంతల్లూరు, వట్టవాడ, వాగమోన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కృషి విజ్ఞాన కేంద్రం కుంకుమ పువ్వు సాగును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి విజయవంతమైంది. గతేడాది పొలంలో కుంకుమ పువ్వులు పూయగా.. నవంబర్‌లో పంట చేతికొచ్చింది
ప్రచారం..ప్రోత్సాహం..
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆ) మార్గదర్శకత్వంలో.. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకె) 2022లో కుంకుమ పువ్వు సాగును ప్రయోగాత్మకంగా చేపట్టంది. పంట సాగుపై ప్రచారం నిర్వహించి, రైతులను ప్రోత్సహించింది. దీంతో చాలా మంది సాగుకు ముందుకు వచ్చారు.
కాశ్మీర్ నుంచి విత్తనాలు..
కాశ్మీర్ నుంచి విత్తనాలను సేకరించి పంట సాగుచేశారు. కోతకు రాకముందే ఊహించని విధంగా కురిసిన వర్షం కారణంగా చాలా వరకు పంట నాశనమైంది. ఇక 2023లో కేవలం ఇద్దరు రైతులు మాత్రమే పంట సాగు చేశారు. వారిలో ఒకరు కాంతల్లూరులోని పెరుమల వద్ద, మరొకరు ఇడుక్కిలోని కుమిలి సమీపంలోని వందన్‌మేడు వద్ద. ఈసారి వారు విజయం సాధించారు. మొక్కలన్నీ పూలతో విరబూశాయి. నవంబరులో పంట చేతికొచ్చింది.
‘‘ఇప్పటి వరకు మా ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. కుంకుమ సాగుకు వాతావరణ పరిస్థితులు, నేల అనుకూలంగా ఉండాలి. నిజానికి ఇడుక్కిలో పండే పూలు మనం కాశ్మీర్‌లో చూసే దానికంటే పెద్దవి. వచ్చే ఏడాదికి మాకు స్పష్టమైన అవగాహన వస్తుంది’’ అని బెంగళూరులోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ వి వెంకటసుబ్రమణియన్ ది ఫెడరల్‌తో అన్నారు.
ఇడుక్కి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ సౌందరరాజన్ మాట్లాడుతూ.. ‘‘కుంకుమపువ్వు సాగును లాభదాయక వాణిజ్యపర పంటగా మార్చడమే మా ఆలోచన. ప్రారంభంలో మేం 15 ప్రాంతాలను ఎంచుకుని, చివరకు ఇడుక్కిలోని పెరుమల (కాంతల్లూరు) వందన్మేడు (కుమిలి) రెండింటిలో విజయం సాధించాం. ఇక మేం కుంకుమ పువ్వును భారీ స్థాయిలో సాగు చేయించే దిశగా ఆలోచిస్తున్నాం. బహుశా ఇది సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.’’ అని తెలిపారు.
‘‘మేము ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత, కాశ్మీర్‌లో ఉన్న వాటి కంటే తక్కువ ధరలకు కుంకుమ పువ్వును అందించగలుగుతాము’’ అని కుంకుమపువ్వు సాగు గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి శ్రీనగర్‌కు ఐదు పర్యటనలు నిర్వహించిన సౌందరరాజన్ తెలిపారు.
టూరిజం స్పాట్‌గా..
కాంతల్లూరు ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కాంతల్లూరును సందర్శించడం ప్రారంభించారు. ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీస్ వంటి శీతాకాలపు పండ్లకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి.
కుంకుమపువ్వు సేద్యం ప్రాజెక్టు ప్రారంభమైతే ఇటీవల ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుగా కేంద్రం గోల్డ్ అవార్డును గెలుచుకున్న కాంతల్లూరుకు పర్యాటక అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయి.
పంటకు అనుకూల వాతావరణ పరిస్థిలేంటి..
కుంకుమ పువ్వు పూయడానికి 20 నుంచి 50 రోజులు పడుతుంది. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల మధ్య ఉండాలి. కుంకుమ సాగుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే సరైన సమయంలో పూలను తెంచి ఎండలో ఆరబెట్టాలి. ఎండబెట్టడం పక్రియ దాదాపు ఒక వారం పడుతుంది.
ఇడుక్కిలో కనీసం 100 ఎకరాలు కుంకుమపువ్వు సాగుకు కేటాయించవచ్చని కెవికె బృందం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వాణిజ్యపరంగా ప్రారంభమైతే.. ఎకరంలో 1 కిలోల కుంకుమపువ్వు లభిస్తుందని అంచనా. మార్కెట్ ధర కిలోకు రూ. 3 లక్షలు ఉంటుంది.