NORTH SOUTH TUSSLE | ఉత్తరాది దక్షిణాది మధ్య వైరం పెరుగుతోందా?
నార్త్, సౌత్ మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిన దక్షిణాది వాసులు- ఈ దేశం ఉత్తరాది వాళ్లదే తప్ప దక్షిణాది వాళ్లది కాదనుకుంటున్నారా?
నార్త్, సౌత్ మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఉత్తర భారతీయులు దక్షిణాది వారిని గుర్తించడం లేదా? దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిన దక్షిణాది వాసులు ఎవరైనా ఈ దేశం ఉత్తరాది వాళ్లదే తప్ప దక్షిణాది వాళ్లది కాదనుకుంటున్నారా? కాస్మోపాలిటన్ సిటీ అయిన ఢిల్లీలోనూ ఉత్తరాది, దక్షిణాది అనే తారతమ్యం ఉందా? ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల ప్రకటనలు చూస్తుంటే ఈ అనుమానాలు నిజమేనని భావించాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ తిరుపతి లోక్ సభ సభ్యుడు ఎం.గురుమూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశమైంది. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సమావేశాన్ని దక్షిణాదిలో నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధానితోపాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది చాలా సంక్లిష్ట సమస్య...
ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అంతరం ఒక సంక్లిష్ట సమస్యే. వివిధ కారకాలతో ముడిపడి ఉంది. భౌగోళికంగా, ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, భాషాపరంగా, వాతావరణ పరంగా కూడా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఉంది. వింధ్య పర్వత శ్రేణులు ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించే పర్వత శిఖరాలు. ఉత్తర భారతదేశంలో గంగానది పరీవాహక ప్రాంతం విశాలమైనది. దక్షిణాన పశ్చిమ, తూర్పు కనుమలు, పీఠభూములు, తీర ప్రాంతాలు ఉన్నాయి. వాతావరణం కూడా అంతే. ఉత్తరాదిన గోధుమ పండిస్తే దక్షిణాన వరి, ఇతర వాణిజ్య పంటలు సాగవుతాయి. దక్షిణ భారతదేశంలోని వాతవరణం వ్యవసాయం, వాణిజ్యం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.
సహజంగానే ఉత్తరాది రాష్ట్రాల విస్తీర్ణం ఎక్కువ గనుక రాజకీయ ప్రభావం ఉత్తరాది వాళ్లదే ఎక్కువగా ఉంటుంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని రాజకీయ పార్టీలు ఊహాత్మక విభజనను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నాయి.
ఇక ఆర్దికంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఆదాయ స్థాయి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకించి సంస్కరణల పర్వం మొదలైన తర్వాత సాఫ్ట్ వేర్ రంగానికి దక్షిణాది రాష్ట్రాలు హైటెక్ కి కేంద్రాలుగా నిలిచాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరిగి సహజంగానే ఉత్తరాది కంటే మెరుగ్గా ఉన్నాయి.
భాషాపరంగా చూస్తే దక్షిణాదిన చాలా ఏళ్ల కిందటే తమిళనాట పెరియార్ ఇవి రామస్వామి ద్రావిడ ఉద్యమాన్ని నడిపారు. హిందీ భాష వ్యతిరేక ఉద్యమం కూడా తమిళనాటే నడిచింది. హిందీని జాతీయ భాషగా అంగీకరించలేదు. దక్షిణ భారతదేశంలోని ద్రావిడ ప్రజలకు ప్రత్యేక దేశం కావాలని, ఉత్తరాది ప్రభావం నుంచి దక్షిణాదిని తొలగించబడాలని పెరియార్ రామస్వామి లాంటి వాళ్లు ఆందోళన చేశారు.
జనాభా తరుగుదల సమస్య...
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1960,70లలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కుటుంబ నియంత్రణ ఉద్యమాన్ని దక్షిణాది రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాయి. ఇద్దరు లేదా ముగ్గురు నుంచి ఒకరు లేదా ఇద్దరు వరకు అనే నినాదాన్ని పాటించారు. ఇప్పుడైతే ఒక్కరే చాలనే దాకా వెళ్లింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా గణనీయంగా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలలో బాగా పెరిగింది. జనాభా సమతూకం దెబ్బతినడంతో ఉత్తరాది రాష్ట్రాలు 2029లో జరిగే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి నాలుగైదు రాష్ట్రాలలో మెజారిటీ సాధించవచ్చు. దక్షిణాది రాష్ట్రాల సీట్లతో సంబంధం లేకుండా ఇక శాశ్వతంగా ఉత్తరాది వాళ్లే ఎల్లప్పుడూ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదికన వనరుల కేటాయింపు కూడా మున్ముందు పెద్ద సమస్య అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయం ఎక్కువగా ఉంటుందని, వచ్చేది తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రూపాయి చెల్లిస్తే తిరిగి వచ్చేది సగం కూడా ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. ఫలితంగా ఉత్తరాదిపై తక్కువ పన్నుల భారం పడి దక్షిణాదిపై ఎక్కువ పన్నుల భారం పడుతుంది.
సాంస్కృతిక పరంగా కూడా ఉత్తరాది వాసులు దక్షిణాది వారిని ఆదరించడం అంతంత మాత్రమే. దక్షిణాది వాళ్ల పేర్లు పలకడం కూడా ఉత్తరాది వాసులకు కష్టంగా ఉంటుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉత్తరాది వాళ్లకు అయినట్టుగా దక్షిణాది రాష్ట్రాల వారి పనులు కావు. ఏ కొద్ది మందికో తప్ప. దేశ రాజధాని అని పేరే గాని అసలు దక్షిణాది వాళ్లను పట్టించుకునే నాధుడే ఉండడని, దక్షిణాది వాళ్లను 'ఇడ్లీ, సాంబార్ వాలా..' అని ఎగతాళిగా మాట్లాడుతుంటారని ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ సిటిజన్ డి.కేశవులు చెప్పారు.
ఆవేళ కర్నాటక ఎంపీ ఏమన్నారంటే...
దక్షిణాదికి అన్యాయం కొనసాగితే ప్రజలు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయవచ్చని కర్ణాటక ఎంపీ సురేశ్ అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు 'భారత్ తోడో' (బ్రేక్ కంట్రీ) కోసం డికె సురేష్ పిలుపునిచ్చారని బిజెపి ఆరోపించింది. సురేష్ ప్రజల అభిప్రాయాలను చెబుతున్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సోదరుడి వ్యాఖ్యలను సమర్థించారు.
కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడే సందర్భంలో “పన్నుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన వాటా దక్కకపోతే దక్షిణ భారతదేశ ప్రజలు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుంది అన్నారు. బిజెపి నేతృత్వంలోని పాలనలో "పన్నుల వాటా పంపిణీలో దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం" అని సురేష్ అన్నారు.
“పన్నుల వాటాలో ఉత్తర భారతదేశం ఎక్కువ పొందుతోంది. కర్ణాటక నుంచి వివిధ పన్నుల కింద ఏటా రూ.4 లక్షల కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. మనం ఎంత తిరిగి పొందుతున్నాం? 16వ ఫైనాన్స్ కమిషన్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే దక్షిణ భారత ప్రజలు గళం విప్పాల్సి ఉంటుందని ” అని సురేశ్ అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమన్నారంటే...
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక పురోగతిని ఉత్తరాది రాష్ట్రాలకు అందిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో అన్నారు. ఐదు దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ట్రాలు సాధించిన ప్రగతికి భిన్నంగా తమిళనాడు ప్రగతి దేశంలోనే ఒక నమూనాగా నిలుస్తుందని స్టాలిన్ చెప్పారు. “తమిళనాడు ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గొప్పగా పట్టణీకరణ జరిగిన రాష్ట్రం” అని ఆయన అన్నారు.
ఈ సందర్భంలో డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై మాటలను స్టాలిన్ గుర్తు చేశారు. 'దక్షిణాది క్షీణిస్తున్న సమయంలో ఉత్తరాది అభివృద్ధి చెందుతోందని అన్నా చెప్పేవారు. కానీ ఈరోజు మనం దక్షిణాదిని వర్ధిల్లేలా చేశాం. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, దక్షిణాది నేడు ఉత్తరాదికి మాత్రమే ఉదారంగా అందిస్తోంది. ఇది నిజమైన వాస్తవం. దీన్ని కాదనలేం” అని స్టాలిన్ చెప్పారు.
వైసీపీ ఎంపీ గురుమూర్తి ఏమన్నారంటే..
తిరుపతి ఎంపీ, వైసీపీ నేత ఎం. గురుమూర్తి తాజాగా కేంద్రానికి ఓ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సమావేశాన్ని దక్షిణాదిలో నిర్వహించాలని ప్రధానితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు సభ్యుల పని తీరును ప్రభావితం చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రానికి తిరుపతి ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు.
1968లో లోక్‌సభలో స్వతంత్ర సభ్యుడు ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతాయి. జనవరి నెలాఖరున బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మధ్యలో కొన్నాళ్లు విరామంతో రెడు విడతలుగా సమావేశాలు సాగుతాయి. జులై - ఆగస్ట్ మాసాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. నవంబర్ – డిసెంబర్ నెలల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహిస్తారు. అయితే ఈ మూడు సమావేశాల్లో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని చాలా కాలంగా పలువురు దక్షిణాది ఎంపీలు తమ తమ రాజకీయ పార్టీలను విస్మరించి డిమాండ్ చేస్తున్నారు.
ఇక రాజధాని ఢిల్లీలో చలి కాలంలో చలి, వేసవి వేడి భరించలేని స్థాయిలో ఉంటాయి. అలాగే వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా శీతాకాల సమావేశాల సమయలో తీవ్ర చలితో పాటు ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సమావేశాలు దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని డిమాండ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ ప్రతిపాదన తన ఎక్స్ ఖాతా వేదికగా చేశారు. దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమైక్యత మరింత పెంపొందుతుందని ఆయన తెలిపారు.
తెలంగాణ ఎంపీ మద్దతు..
వైసీపీ ఎంపీ గురుమూర్తి రాసిన లేఖను తెలంగాణలోని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. ఈ అంశంపై తమ పార్టీ అధిష్టానంతో చర్చించి తాను సైతం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
దాదాపు ఇదే అంశాన్ని కేరళలోని సీపీఎం ఎంపీలు కూడా గతంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాలను విస్మరించవద్దని కోరారు.
ఈ ఏడాది ప్రారంభంలో పెట్రోల్ ధరలు తగ్గించడం గురించి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవ జరిగింది. కేంద్రం ఉత్తరాదిపై ప్రేమ చూపిస్తోందంటూ మండి పడ్డాయి.
చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే...
బీజేపీకి సన్నిహిత మిత్రునిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కాలంగా ఓ మాట చెబుతున్నారు. పిల్లల్ని ఎక్కువ మందిని కనమని సలహా ఇస్తున్నారు. దీనర్థం మున్ముందు జరగబోయే పార్లమెంటు సీట్ల పునర్ వ్యవస్థీకరణలో రాష్ట్రానికి జరగబోయే అన్యాయాన్ని ఆయన ముందుగా ఊహించినా ప్రస్తుతం ఆయన బీజేపీ కూటమిలో భాగస్వామి గనుక నేరుగా ఆ మాట చెప్పలేకపోవచ్చు. రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన వనరుల కేటాయింపు ఉండే పక్షంలో ఏపీకి తీరని అన్యాయమే జరుగుతుంది.
పరిష్కారం అంత సులభం కాదు...
ఉత్తరప్రదేశ్ ను చూసినట్టే దక్షిణాది రాష్ట్రాలనూ చూడాలని పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది దక్షిణాది రాష్ట్రాల నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. సంక్లిష్టమైన పన్నుల విధానం దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయమే చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎక్కువ డబ్బును ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంప్ చేస్తున్నారనే విమర్శా ఉంది. 2026 లేదా 2029లో జరిగే డీలిమిటేషన్ సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు మరింత గందరగోళానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకపోవడంతో దక్షిణాదిలో అసంతృప్తి పెరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి చెబుతున్నారు. కాలక్రమేణా జనాభా పెరుగుదలలో వచ్చే మార్పులు దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడం అంత సులువు కాదు.
ప్రేమాభిమానాలే పునాదిగా భారత్ ఆవిర్భవించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా ఇటీవల చెప్పారు. ఇంతవరకు నిజమే అయినా ఆదాయ వనరుల పంపిణీలో జరిగే అసమానతలు, పాలకపార్టీల నైజం కొన్ని రాష్ట్రాల పాలిట శాపం కారాదని సామాజిక కార్యకర్త, న్యాయవాది మల్లెల శేషగిరిరావు చెప్పడం గమనార్హం.
Next Story