మమత-జూడాల సమావేశం రాజకీయ రంగు పులుముకుందా?
x

మమత-జూడాల సమావేశం రాజకీయ రంగు పులుముకుందా?

‘‘నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు మమత చూపే నిబద్ధత మరే ఇతర నాయకుడూ కనపర్చరు. వారి వెనక సీపీఎం, బీజేపీ నాయకులు ఉన్నారు’’ - TMC ఎంపీలు


కోల్‌కతా RG కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు దాటి పోయింది. సీబీఐ కేసును దర్యాప్తు చేస్తోంది. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని న్యాయస్థానం సూచించింది. అయినా పశ్చిమ బెంగాల్‌లోని జూనియర్ ప్రభుత్వ వైద్యులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో TMC ఎంపీలు జూనియర్ డాక్టర్ల తీరుపై విరుచుకుపడుతున్నారు. రోగులు ఇబ్బందులు పడుతుంటే వైద్యులు 'అమానవీయం'గా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.

డర్టీ పాలిటిక్స్..TMC

ఆందోళన చేస్తున్న వైద్యులతో చర్చలు జరిపేందుకు సచివాలయంలోని ఖాళీ కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి మమత ఒంటరిగా కూర్చున్న ఫోటోను TMC రాజ్యసభ ఎంపీ ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

జూనియర్ డాక్టర్లను కలిసేందుకు మమత ‘రెండు గంటల నుంచి’ ఎదురు చూస్తున్నారని అయితే వారు హాజరు కాలేదని టీఎంసీ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోకలే పోస్ట్‌లో రాశారు. ‘‘నిరసనకారులతో చర్చలు జరపడంలో ఈ స్థాయి నిబద్ధత మరే ఇతర నాయకుడూ కనబర్చలేదు. జూనియర్ డాక్టర్లను సీపీఎం, బీజేపీ నాయకులు చర్చలకు రాకుండా అడ్డుకుంటున్నారు.వారిని పావులుగా వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని జూనియర్ డాక్టర్లు గ్రహించాలి. ఈ డర్టీ పాలిటిక్స్ కారణంగా లక్షలాది మంది రోగులు బాధపడుతున్నారు. జూడాల డిమాండ్లు రోజురోజుకు మారిపోతున్నాయి. వారిలో నిబద్ధత లోపించింది ’’ అని ఆరోపించారు.

మరోవైపు మరో TMC ఎంపీ కళ్యాణ్ కూడా నిరసన తెలిపిన వైద్యులపై మండిపడ్డారు. వారు వైద్య వృత్తికి అనర్హులు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను పరీక్షలు రాసేందుకు కూడా అనుమతించకూడదని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు.

బీజేపీ ఎదురుదాడి..

టీఎంసీ ఎంపీల వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘మమత పారదర్శకతకు భయపడ్డారు. సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల డిమాండ్‌ను అంగీకరించేందుకు వెనకాడారు. నబన్నో వద్ద ఆమెను కలవడానికి వైద్యుల ప్రతినిధి బృందం వెళ్తే.. ఆమె ఏకపక్షంగా సమావేశాన్ని రద్దు చేసింది. ఇప్పుడేమో విలేకరుల సమావేశంలో జూనియర్ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రోగుల మరణాలకు వైద్యులను నిందించడం మొదలుపెట్టారు.’’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా చెప్పారు.

Read More
Next Story