మోదీ విజయ రహస్యం ఈవీఎంలో ఉందా?
x

మోదీ విజయ రహస్యం ఈవీఎంలో ఉందా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అన్ని స్థానాలు వస్తాయా? తాను చెప్పిందే జరుగుతుందంటున్న ఆ వ్యక్తి ఎవరు? అంత గట్టిగా చెప్పడానికి కారణమేంటి?


ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ‌మిషన్‌ (ఈవీఎం)లను సరిచేయకుంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా దక్కించుకుంటుందన్నారు శామ్‌ ‌పిట్రోడా. తన వాదనకు బలం చేకూరుస్తూ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ ‌బి లోకూర్‌ అధ్యక్షతన ‘ది సిటిజన్స్ ‌కమిషన్‌ ఆన్‌ ఎలక్షన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదికను పిట్రోడా ఉదహరిస్తున్నారు. ఓటరు ధృవీకరించుకునే విధంగా వివిపాట్‌ ‌విధానం తేవాలని ఆ నివేదిక సారాంశమని ఆయన చెబుతున్నారు.

ఎవరీ శామ్‌ ‌పిట్రోడా ?

శామ్‌ ‌పిట్రోడా అలియాస్‌ ‌సత్యనారాయణన్‌ ‌గంగారాం ఒడిషాలో జన్మించారు. పారిశ్రామిక వేత్త, విధానాల రూపకర్త కూడా. భారతదేశపు జాతీయ నాలెడ్జి కమిషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. వరల్డ్ ‌టెల్‌ ‌లిమిటెడ్‌ అనే సంస్థకు ఛైర్మన్‌, ‌ముఖ్య కార్య నిర్వహణ అధికారి. 1992 లో ఐక్యరాజ్య సమితికి సహాయకునిగా పనిచేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఓవర్సీస్‌ ‌ప్రెసిండెట్‌గా వ్యవహరిస్తున్నారు.

‘‘వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవి. ఎటువంటి దేశాన్ని నిర్మించాలనుకుంటున్నామో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి.’’అని పేర్కొంటున్న పిట్రోడా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలంటున్నారు.

‘‘ఈవీఎంలపై రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. తొలుత సంతకాల సేకరణ చేపట్టాలి. తర్వాత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అవసరమైతే యువత వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపేలా ప్లాన్‌ ‌చేయాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ అమేథీ నుంచి ఓడిపోవడానికి ఈవీఎం ట్యాంపరింగే కారణం. త్వరలో సాంకేతిక నిపుణులతో కలిసి జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందు వస్తా’’ అని శామ్‌ అన్నారు.

‘‘ఇప్పటికే ఈవీఎంలపై నాకున్న అనుమానాలపై సెంట్రల్‌ ఎలక్షన్‌ ‌కమిషన్‌కు లేఖ రాశా.. రిప్లై రావాల్సి ఉంది’’ అని తెలిపారు.

ఆ అనుమానం ఇండియా కూటమిది కూడా..

కాంగ్రెస్‌ ‌సహా కొందరు ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఓటమి చనిచూసింది. దీంతో ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ ‌సహా ఇతర ప్రతిపక్షాల నాయకులు ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్‌ ‌వెరిఫైబుల్‌ ‌పేపర్‌ ఆడిట్‌ ‌ట్రయల్‌ (‌వివిపిఎటి) స్లిప్పులు పెట్టెల్లో పడకుండా ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

కాంగ్రెస్‌ కూడా భాగమైన ప్రతిపక్ష ఇండియా కూటమి రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోకపోవడంపై కూడా పిట్రోడా నోరువిప్పారు. ‘‘ ఇండియా కూటమి ప్రధాని పదవి కోసం ఎవరినీ ప్రొజెక్ట్‌ చేయడం లేదు. దాని గురించి కూటమి ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటుంది.’’ అని చెప్పారు.

రామమందిరంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు..

రామమందిరంపై తన వ్యాఖ్యలపై వక్రీకరించారని పిట్రోడా అంటున్నారు.‘‘నేను రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడిఉన్నా. మతం వ్యక్తిగత విషయం. దాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు. మీరు వేడుకలు జరుపుకోవచ్చు. ప్రజలు ఇష్టపడిరది వారు జరుపుకుంటారు.’’ అని అన్నారు.

శామ్‌ ‌వ్యాఖ్యలపై గరంగరం..

పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ గుర్రుగా ఉంది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆలోచనకు అనుగుణంగానే మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు కమలం పార్టీ నేతలు. రాహుల్‌ గాంధీకి గురువు పిట్రోడా అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story