
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: JD(U) అభ్యర్థుల తొలి జాబితా విడుదల
57 మంది పేర్లను ఫైనల్ చేసిన సీఎం నితీష్ కుమార్..
బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly polls) నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 57 మంది పేర్లతో తొలి జాబితాను బుధవారం (అక్టోబర్ 15) విడుదల చేసింది. పార్టీ ముఖ్యనేతలు- రత్నేష్ సదా సోన్‌బర్సా నుంచి, విద్యాసాగర్ నిషాద్ మోర్వా నుంచి, ధుమల్ సింగ్ ఎక్మా నుంచి, కౌశల్ కిషోర్ రాజ్‌గిర్ నుంచి పోటీ చేస్తున్నారు.
పార్టీ సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు దక్కాయి. మంత్రి విజయ్ కుమార్ చౌదరి సరాయ్ రంజన్ నుంచి, నరేంద్ర నారాయణ్ యాదవ్ అలంనగర్ నుంచి, నిరంజన్ కుమార్ మెహతా బిహారీగంజ్ నుంచి, రమేష్ రిషి దేవ్ సింగేశ్వర్ నుంచి, కవితా సాహా మాధేపుర నుంచి పోటీ చేస్తున్నారు. ఏడాది క్రితం ఆర్జేడీని వీడి తిరిగి పార్టీలో చేరిన శ్యామ్ రాజక్‌కు కూడా టికెట్ దక్కింది.
ఐదుగురు మంత్రులకూ టిక్కె్ట్లు దక్కాయి. నలంద నుంచి అభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్, జలవనరుల మంత్రి విజయ్ కుమార్ చౌదరి (సరైరంజన్), సమాచార, ప్రజా సంబంధాల మంత్రి మహేశ్వర్ హజారి (కళ్యాణ్‌పూర్), సామాజిక సంక్షేమ మంత్రి మదన్ సాహ్ని (బహదూర్‌పూర్) నుంచి, ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా సోన్‌బార్సా నుంచి పోటీ చేయనున్నారు.
LJP నుంచి ఐదుగురు..
సీట్ల సర్దుబాటులో భాగంగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి మొత్తం 29 స్థానాలు దక్కాయి. ప్రస్తుతానికి మోర్వా, సోన్‌బార్సా, రాజ్‌గిర్, గైఘాట్, మతిహాని స్థానాల నుంచి తమ అభ్యర్థులు పోటీచేస్తారని ఆ పార్టీ పేర్కొంది. వాస్తవానికి పోయినసారి ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి JD(U) అభ్యర్థులు గెలుపొందారు. ఈ సారి వాటిని పాశ్వాన్ కోరడంపై నితీష్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
మొత్తం 243 స్థానాలకు గాను BJP, JD(U) 101 సీట్ల చొప్పున పంచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా(RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు ఆరు సీట్ల చొప్పున ఇచ్చారు. ఎన్నికలు రెండు దశల్లో (నవంబర్ 6, 11 తేదీల్లో) జరుగుతాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.