
కంచి కామకోటి పీఠం గురుపరంపరకు ఎంపికైన తెలుగు వాసి దుడ్డు గణేష్
అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30న) బాధ్యతల అప్పగింత..
శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కాంచి కామకోటి పీఠానికి (Kanchi Kamakoti Peetam) నూతన అధిపతిగా తెలుగు యువకుడి నియామకం దక్షిణాది రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన భళ్లమూడి సూర్యనారాయణ దత్తపుత్రుడు, దుడ్డు ధన్వంతరి కుమారుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పదవికి ఎంపికయ్యారు. గణేశ శర్మ అన్నవరంలో జన్మించారు. తన బాల్యంలోనే తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేపట్టి, సంస్కారబద్ధమైన జీవనవిధానాన్ని అలవర్చుకున్నారు. అనంతరం తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో ప్రవేశించి, రుగ్వేదం సహా యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేదసాహిత్యాలను సంపూర్ణంగా అభ్యసించారు. మేనమామ పండు వద్ద కూడా వేదాభ్యాసాన్ని కొనసాగించారు. ఆయనకు ఒక అక్క ఉన్నారు. ఆమె వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. గణేష్‌ను ఇంట్లో అందరూ అజయ్‌గా పిలుస్తుంటారు. 2006 లో వేదాధ్యయనంలో ప్రవేశించినప్పటి నుంచి శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు, మార్గదర్శనంలో గణేశ శర్మ నడుచుకుంటున్నారు. తెలంగాణలోని బాసర సరస్వతి దేవస్థానంలో ఆయన వేదపండితుడిగా సేవలు అందించారు.
సన్యాస దీక్ష కార్యక్రమం..
దుడ్డు గణేశ శర్మ ద్రావిడ్‌కి శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆశీర్వచనాలతో సన్యాస దీక్షా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పావన సంఘటన అక్షయ తృతీయ రోజున అంటే 2025 ఏప్రిల్ 30న కాంచీపురంలోని శ్రీ శంకర మఠం వద్ద ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయన బంధు మిత్రులను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో వేద పండితులు అనివెళ్ల శాస్త్రి తదితరులు ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమం జగద్గురు ఆది శంకరాచార్యుల 2534వ జయంతి మహోత్సవాలను (మే 2, 2025) పురస్కరించుకొని జరుగుతోంది. ఆదిశంకరులు క్రీస్తుపూర్వం 482 సంవత్సరంలో కాంచీపురంలో స్థాపించిన శ్రీ కాంచి కామకోటి పీఠానికి ఇది గొప్ప చారిత్రక సందర్భం. తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ మఠం 2500 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తుంది.
మఠం సంప్రదాయం ప్రకారం 25 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి మాత్రమే పీఠాధిపతికి అర్హులు. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి కూడా యుక్తవయసులోనే మఠం బాధ్యతలు చేపట్టిన వారే. 42 సంవత్సరాల క్రితం 1983 మే 29న 14 ఏళ్ల వయస్సున్న శంకరనారాయణన్ .. విజయేంద్ర సరస్వతి పేరుతో మఠం 70వ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత 2018లో జయేంద్ర సరస్వతి ఆ బాధ్యతలను స్వీకరించి మఠం వ్యవహారాలను చూసుకున్నారు.