కేసీఆర్‌ గారు, ఎలా ఉన్నారు?

రాజకీయాలు పార్టీలు వేరు, మానవ సంబంధాలు వేరు


కేసీఆర్‌ గారు, ఎలా ఉన్నారు?
x
కేసీఆర్‌ను పరామర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రాజకీయాలు పార్టీలు వేరు, మానవ సంబంధాలు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరిగా తలపడిన ప్రత్యర్థులు వాళ్లిద్దరూ.. ఒకరి అంతు చూస్తామంటే ఒకరి అంతు చూస్తామనుకున్నారు. తిట్లు, శాపనార్ధాలు పెట్టుకున్నారు. కానీ అవి ఎన్నికల వరకే పరిమితం. ఆ తర్వాత అంతా మనుషులే. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును పరామర్శించడం. పోయిన గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మీరు త్వరగా అసెంబ్లీకి రావాలి
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. నేరుగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పలకరించివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ తో పాటు మంత్రి సీతక్క, పార్టీ నేత షబ్బీర్‌ అలీతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్‌, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ‘కేసీఆర్‌ను పరామర్శించాను.. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నాం. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం ఉంది. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరముంది. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరా’’ అన్నారు రేవంత్‌.
మంత్రుల పరామర్శ
మరోపక్క మంత్రులు కూడా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడిగి తెలుసుకున్నారు. ‘‘కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు పొన్నం


Next Story