AAP - BJP | ఇటు హామీ..అటు నిరసన
సెక్యూరిటీ గార్డుల నియామకానికి ఆర్‌డబ్ల్యుఏలకు ఆర్థిక సాయం చేస్తామని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో హామీతో ముందుకొచ్చారు. తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఏ)లకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు(Security Guards)లను నియమించేందుకు ఆర్థిక సాయం(Financial Assistance) చేస్తానని చెప్పారు. అయితే అందనున్న ఆర్థిక సాయం, గార్డుల సంఖ్యకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని కేజ్రీవాల్ మీడియాతో అన్నారు. ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఢిల్లీ ప్రజల అవసరాలను పట్టించుకోకపోవడంతోనే వారు 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారని ఆరోపించారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్లను 8వ తేదీ లెక్కిస్తారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ఓటర్లను ఎన్నికల జాబితాలో చేర్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్న భద్రతా బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిరసనకారులను ఆపేందుకు వాటర్ కేనన్లను ప్రయోగించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 8 మధ్య 13,000 కొత్త ఓటర్ల చేరికపై కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు కూడా చేశారు.