
RSS గీతాలాపనపై కేరళ ప్రభుత్వ ఆగ్రహ జ్వాల..
వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడడంపై దర్యాప్తునకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి..
ఎర్నాకుళం నుంచి బెంగళూరు(Bangalore)కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat train) ప్రారంభం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విద్యార్థులతో ఆర్‌ఎస్‌ఎస్(RSS) పాట పాడించడంపై కేరళ(Kerala) ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్స్ (డీపీఐ)ని ఆదేశించారు. దేశ లౌకిక, జాతీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూనే..రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థులను వాడుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
తప్పేంటని ప్రశ్నించిన సురేష్ గోపి..
అయితే కేంద్ర మంత్రి సురేష్ గోపి RSS పాట పాడటాన్ని సమర్థించుకున్నారు. "వారు ఆ పాటను పాడాలనుకున్నారు. పాడేశారు. ఆ పాట తీవ్రవాదానికి సంబంధించినది కాదు" అని పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి అన్నారు.
‘రాజ్యాంగ ఉల్లంఘనే..’
కాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా దక్షిణ మధ్య రైల్వే చర్యను శనివారం ఖండించారు. మత విభజనకు దారితీసే ఆర్‌ఎస్‌ఎస్ పాటను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాడడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమేనన్నారు. సంఘ్ పరివార్ తమ మత, రాజకీయ ప్రచారానికి విద్యార్థులను వాడుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.
‘సతీశన్‌ది అదే మాట..’
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమంలో విద్యార్థులతో ఆర్‌ఎస్‌ఎస్ పాట పాడించడం "చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం" అని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో కనిపించే విభజన రాజకీయాలను కేరళలో అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
‘చక్కగా పాడారంటూ పోస్ట్..’
విద్యార్థులు RSS గీతం పాడుతుండగా తీసిన వీడియోను దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోషల్ మీడియా పోస్టు చేశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును శనివారం తొలగించారు. అయితే ఆదివారం అదే RSS పాటను ఆంగ్ల అనువాదంతో మళ్లీ పోస్ట్ చేశారు. "ఎర్నాకులం బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో సరస్వతి విద్యాలయ విద్యార్థులు తమ పాఠశాల పాటను చక్కగా పాడారు" అని 'X'లో పోస్టు చేశారు.

