
పహరా కాస్తున్న సైనికుడు
ఖమేనీ మృతి: జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ నిలిపివేత
మూతపడ్డ పాఠశాలలు
ఇరాన్ సుప్రీంలీడర్, షియాల మతగురువు అయిన అయతుల్లా అలీ ఖమేనీ మృతి నేపథ్యంలో కశ్మీర్ లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ముందస్తుగా ఇంటర్నెట్ సర్వీస్ లను నిలిపివేశారు. అలాగే పాఠశాలలను కూడా మూసివేశారు. అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధించారు.
లాల్ చౌక్ లోని ఐకానిక్ ఘంటా టవర్ చుట్టూ బారికేడ్లూ ఏర్పాటు చేసిన అధికారులు ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నిరసనకార్యక్రమాలు జరగకుండా నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ - అమెరికా చేసిన సంయుక్త దాడిలో అయతుల్లా ఖమేనీ మృతి చెందారు. ఇరాన్ కు చెందిన అధికారిక మీడియా ‘ఇర్నా’ మరణ వార్తను ధృవీకరించింది. ఇది భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ప్రజలకు ఆగ్రహం కలిగించి, తీవ్ర నిరసనలకు దారితీసింది.
కశ్మీర్ లోయలో...
కశ్మీర్ లోయలో దాదాపు 15 లక్షల మంది షియాలు ఉన్నారు. లాల్ చౌక్, సైదా కదల్, బుద్గాం, బందిపోరా, అనంత్ నాగ్, పుల్వామాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోయలోని ఇతర షియా మెజారిటీ ప్రాంతాలలో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఖమేనీ మృతికి నిరసన తెలపాలని ముతాహిదా మజ్లిస్ ఏ ఉలామా(ఎంఎంయూ) చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ పిలుపునివ్వడంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ‘‘ప్రజలు దీనిని ఐక్యత, గౌరవంతో పాటు శాంతియుతంగా నిరసన పాటించాలని మేము కోరుతున్నాము’’ అని మీర్వాయిజ్ అన్నారు.
ఇంటర్నెట్ ఆంక్షలు..
ఈ నిరసనల నేపథ్యంలో కశ్మీర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి ముందస్తు జాగ్రత్తగా ఈచర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలని కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
‘‘దయచేసి ధృవీకరించని సమాచారం, ఊహగానాలు, లేదా పుకార్లను ప్రచురించవద్దు. ఏదైన వార్త విశ్వసనీయమైన అధికారిక వనరులు ద్వారా ధృవీకరించబడ్డాయని ముందే నిర్ధారించుకోండి, అనవసరమైన భయాందోళనలు సృష్టించే సంచలనాత్మక ముఖ్యంశాలను నివారించండి’’ అని సలహ జారీ చేశారు. ప్రజల విశ్వాసం కాపాడుకోవడానికి, తప్పుడు సమాచారం నిరోధించడానికి బాధ్యతాయుతమైన కచ్చితన నివేదిక అవసరమని పోలీసులు తెలిపారు.
Next Story

