కేటీఆర్ సారూ.. మన విమానం ఏడుందే...
x
కేసీఆర్.. విమానం

కేటీఆర్ సారూ.. మన విమానం ఏడుందే...

సొంత విమానం ఉందన్నప్పుడు కాలర్ ఎగరేసి తిరిగిన గులాబీ బాస్ లు ఇప్పుడు అదంతా దుష్ప్రచారం అంటున్నారు.. ఇంతకీ విమానం ఉన్నట్టా లేనట్టా?


హైదరాబాద్, తెలంగాణ భవన్..మహబూబాబాద్ లోక్ సభ సీటుపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం సీరియస్ గా జరుగుతోంది. కేటీఆర్, హరీశ్ రావు చాలా విషయాలు పూస గుట్టినట్టు చెబుతున్నారు. ఎందుకు ఓడిపోయామో చెబుతుండగా ఓ కార్యకర్త లేచి “సార్, ఇవన్నీ సరే గాని ఇంతకీ మన పార్టీకి సొంత విమానం ఉందా లేదా?” అని అమయాకంగా అడిగేశారు. దీనికి మిగతా వాళ్లు కూడా కోరస్ పలికారు. దీంతో రెండున్నర ఏళ్ల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు ఎలియాస్ కేటీఆర్ నోరు విప్పక తప్పలేదు.

బీఆర్‌ఎస్‌కి సొంత విమానం ఉన్నట్టా? లేనట్టా? ఉంటే ఏమైందీ? ఇప్పటి వరకు జరిగిన ప్రచారమంతా ఉత్తుత్తిదేనా? ఇదే నిజమైతే ఇంతకాలం పార్టీ నేతలు మాటా ముచ్చట లేకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇదీ విమానం కథ...


2022 అక్టోబర్‌ దసరా నాడు టీఆర్‌ఎస్‌... బీఆర్‌ఎస్‌గా అవతరించింది. తెలంగాణలో రెండోసారి గెలిచి మంచి ఊపుమీదున్న కేసీఆర్.. టీఆర్ఎస్ ను దేశవ్యాప్తం చేయాలనుకున్నారు. జాతీయ పార్టీగా మారేనాటికే సిక్స్‌ సీటర్‌ జెట్‌ ప్లేన్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఆనాడు వార్తలు వచ్చాయి. పార్టీ నిధులు దాదాపు వంద కోట్లతో ఆ విమానాన్ని కొనుగోలు చేయబోతున్నారని కూడా మీడియా కోడై కూసింది. ఇంతకాలం మరుగున పడిన విషయం ఇవాళ ఆకస్మాత్తుగా చర్చకు వచ్చింది. అప్పట్లో దీని గురించి పెద్దగా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది.

సంపన్న పార్టీలలో బీఆర్ఎస్...

దేశంలోని సంపన్న రాజకీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి. 2021-2022 నాటికి ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ సుమారు 512.24 కోట్ల రూపాయలున్న భారీ నిధులున్న పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ బాస్ కేసీఆర్.... జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టారు. పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి-బీఆర్‌ఎస్‌- అవసరాల కోసం పార్టీ ఓ విమానం కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. ఇది జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా చర్చకు దారి తీసింది. ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా ఓ రాజకీయ పార్టీ సొంత విమానం ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనూ సంచలనం సృష్టించింది.

ఎన్ని సీట్లున్న విమానం?

2022 సెప్టెంబర్‌ 8న వచ్చిన వార్తల ప్రకారం ఎన్ని సీట్లున్న విమానంపై బీఆర్‌ఎస్‌లో చర్చ జరిగిందని.. 8 సీట్లున్న జెట్‌ను కొనాలా లేక 12 సీట్లున్న విమానాన్ని కొనాలా అనే దానిపై తర్జన భర్జన పడిన తర్వాత ఆరు సీట్లున్న విమానాన్ని కొనాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఎవ్వరూ అప్పట్లో పల్లెత్తు మాట మాట్లాడలేదు. పైగా అదో గొప్పగా కూడా ఫీలయ్యారు. సొంత విమానం ఉందో, లేదో కూడా స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినపుడు ఏ విమానాన్ని వాడారో కూడా చెప్పలేదు. కానీ ప్రస్తుతం తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో.... ఈ అంశం చర్చకు వచ్చింది. సమావేశాలకు హాజరైన పలువురు కార్యకర్తలు ఈ సొంత విమానం ప్రస్తావన తెచ్చారు.

ప్రజల జ్ఞాపకంతో పరీక్ష ఎల్లప్పుడూ సాధ్యం కాదేమో...

సొంత విమానం కొనుగోలు చేసి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని దృష్టి పెట్టి... రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని కార్యకర్తలు నేరుగా పార్టీ నేతలతోనే అన్నారు. రాజకీయాల్లో ఓ సామెత ఉంటుంది. పీపుల్స్ మెమొరీ ఈజ్ వెరీ షార్ట్ అని అంటే ప్రజలు దేన్నైనా తక్కువ కాలమే జ్ఞాపకం పెట్టుకుంటురని.. ఇది తలకిందులైంది విమానం విషయంలో.. పార్టీ కార్యకర్తల ప్రస్తావనతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.

అదంత తప్పుడు ప్రచారమన్న కేటీఆర్..

పార్టీ సొంత విమానం కొనుగోలు చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ద్వారానే పార్టీ ఓటమి పాలైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ విమానం కొనుగోలు చేసే ఆలోచన కూడా చేయలేదని, విపక్ష పార్టీల కుట్రల కారణంగా బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు కేటీఆర్‌. పార్టీలో జరిగిన లోటుపోట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు కేటీఆర్.

ఇంతకాలానికైనా పార్టీకి సొంత విమానం లేదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే తేల్చిచెప్పడం సంతోషమే అయినా జరగాల్సిన దుష్ప్రచారం ఇప్పటికే జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క.. ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయారని కార్యకర్తలు గుసగుసలు పోయారు.

Read More
Next Story