మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం పెద్దలతో లాబీయింగ్
x

మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం పెద్దలతో లాబీయింగ్

జాతి సంఘర్షణను పరిష్కరించడంలో సత్ఫలితాలనివ్వని రాష్ట్రపతి పాలన..


Click the Play button to hear this message in audio format

మణిపూర్‌(Manipur)లో హింసాత్మక ఘటనలకు ఇంకా తెరపడలేదు. కుకి-నాగా (Kuki-Naga) జాతుల మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. మరోవైపు మణిపూర్‌లో వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు కేంద్రంలోని పెద్దలను కోరారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు..

మణిపూర్‌లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించేందుకు రాధేశ్యామ్ (Radheshyam) నేతృత్వంలోని బీజేపీ(BJP) ఎమ్మెల్యేల బృందం న్యూఢిల్లీలో మకాం వేస్తున్నట్లు మణిపూర్ బీజేపీ వర్గాలు ది ఫెడరల్‌కు తెలిపాయి. వీరంతా బిరేన్ సింగ్ (Biren Singh) వ్యతిరేక శిబిరానికి చెందినవారని తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి బిరేన్ శిబిరానికి చెందిన మరో ఎమ్మెల్యేల బృందం గురువారం సాయంత్రం (ఏప్రిల్ 17) రాజ్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసింది. భల్లాను కలిసిన ఆర్‌కె ఇమో, ఖ్ ఇబోమ్చా, కరం శ్యామ్, దింగాంగ్‌లంగ్ గంగ్‌మెయి, ఉషమ్ దేబెన్ ప్రజా సమస్యలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండాలని గవర్నర్‌ను కోరినట్లు ఒక ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పికె సింగ్‌ను మార్చడం గురించి ఎమ్మెల్యేలు గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం.

అస్సాం సీఎంతో భేటీ ?

రాష్ట్రపతి పాలనలో ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బిరేన్ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కలిసినట్లు తెలుస్తోంది.

నిర్ణయం వెనక్కు..

ప్రస్తుతం మణిపూర్‌లో జాతి సంఘర్షణను పరిష్కరించడంలో రాష్ట్రపతి పాలన విఫలమైంది. గవర్నర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రెండు ముఖ్యమైన చర్యలు విఫలమయ్యాయి. ప్రజల స్వేచ్ఛాయుత కదలికను పునరుద్ధరించాలని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో మెయిటీ, కుకి-జో గ్రూపుల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి సమావేశం సత్ఫలితాలనివ్వలేదు. ఇటు 16 పౌర సమాజ సంస్థల కూటమి పీపుల్స్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మణిపూర్ (PPAM) వచ్చే వారం నాటికి ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని పట్టుబడుతోంది.

సాయుధ బలగాలతో భయం గుప్పిట్లో జనం..

లోయ, కొండ ప్రాంతాల్లో సాయుధ గ్రూపుల గస్తీతో పౌరులు భయాందోళనకు గురవుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.

సాయుధ బలగాలు ఎలా రాజ్యమేలుతున్నాయో చెప్పడానికి ఆయన రెండు ఘటనలను ఉదహరించారు. ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) డైరెక్టర్ డాక్టర్ గురుఅరిబమ్ సునీల్ కుమార్ శర్మ నివాసంపై గ్రెనేడ్ విసిరిన ఘటన, ఈ నెల ప్రారంభంలో కాంగ్‌పోక్పి జిల్లాలోని కొంతమంది నాగా గ్రామ నాయకులపై జరిగిన దాడుల గురించి చెప్పుకొచ్చారు. మొదటి ఘటనలో గ్రెనైడ్ పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు. ఈ దాడికి ఏ సంస్థ లేదా వ్యక్తి బాధ్యత వహించకపోవడంతో లోయలోని సాయుధ బలగాలపై అనుమానం నెలకొంది.

నాగ తెగ సమావేశం..

కుకి వర్గానికి చెందిన కొంతమంది సాయుధ ఉగ్రవాదులు ఏప్రిల్ 5న కాంగ్‌పోక్పి జిల్లాలోకి ప్రవేశించారు. నాగాల ఆధిపత్యం ఉన్న కోన్సాఖుల్ గ్రామానికి చేరుకుని గ్రామ పెద్ద, గ్రామ చైర్మన్, స్థానిక పాస్టర్ సహా అనేక మంది నివాసితులపై దాడి చేశారు. నిందితులెవరిని అరెస్టు చేయకపోగా..గ్రామ పెద్ద పరిస్థితి విషమంగా ఉందని కోన్సాఖుల్ గ్రామ కార్యదర్శి తెలిపారు. కోన్సాఖుల్ గ్రామానికి పొరుగున కుకి ప్రాబల్యం ఉన్న హరాయోథెల్ గ్రామంలో భూ వివాదమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన నాగాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.

బాధితులకు సంఘీభావం...

దాడికి గురైన గ్రామస్తులకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం కోన్సాఖుల్‌లో నాగా తెగకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించినట్లు సమాచారం. కాగా ఈ హింసాత్మక దాడిని మణిపూర్‌లోని స్వదేశీ ప్రజల వేదిక (IPFM) అధ్యక్షుడు అషాంగ్ కాసర్ తీవ్రంగా ఖండించారు. ఇది నాగా ఆచార చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా స్వదేశీ ప్రజల గౌరవంపై దాడిగా అభివర్ణించారు.

"గ్రామ పెద్దలు, ఛైర్మన్‌కు ఉన్నతంగా గౌరవిస్తాం. నాగా తెగ నాయకులపై దాడి చేయడం అంటే మొత్తం నాగ సమాజంపై దాడిచేసినట్టే, " అని కాసర్ ది ఫెడరల్‌తో అన్నారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్రపతి పాలన ఏ ప్రయత్నం చేయకపోవడంపై కాసర్ ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థి సంఘాలు కూడా..

యునైటెడ్ నాగా కౌన్సిల్ (UNC), ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్, మణిపూర్ (ANSAM) మరియు నాగా ఉమెన్ యూనియన్ (NWU) కూడా ఈ పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇటు జెమ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మణిపూర్ (ZSOM), రోంగ్‌మెయ్ నాగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మణిపూర్ (RNSOM), లియాంగ్‌మై నాగ కటిమై రువాంగ్డి, మణిపూర్ (LNKR) శుక్రవారం గవర్నర్‌ను కలిశాయి. ఐదు రోజుల్లోగా దోషులను అరెస్టు చేసి, వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరాయి. అలా చేయడంలో విఫలమైతే..శాంతియుత నిరసనలకు పూనుకుంటామని హెచ్చరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించడంతో ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలకు దిగడం తప్ప మరో మార్గం లేదు’’ అని చెప్పారు.

సంతకాల సేకరణలో బిరెన్ వ్యతిరేక శిబిరం..

గత నెలలో చురచంద్‌పూర్ జిల్లాలో కుకి-జో వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. ఈ పరిణామాల మధ్య బిరేన్ అనుకూల, వ్యతిరేక శిబిరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఒత్తిడి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిరెన్ వ్యతిరేక శిబిరం మరోసారి తమ బలాన్ని ప్రదర్శించడానికి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారో ఇంకా తెలియరాలేదు.

మణిపూర్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలు 59 మంది. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు 37 మంది కాగా దాని మిత్రపక్షాలైన ఎన్‌పీపీకి చెందిన వారు ఆరుగురు, ఎన్‌పీఎఫ్‌ చెందిన వారు ఐదుగురు, స్వతంత్రులు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఐదుగురు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నా.. కొత్త నాయకుడిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాలేదు.

వచ్చే నెలలో పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Read More
Next Story