నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక: బిర్లా Vs సురేష్
x

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక: బిర్లా Vs సురేష్

లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.దాంతో ఎన్‌డీఎ తరుపున ఓం బిర్లా, ఇండియా కూటమి తరుపున కోడికున్నిల్‌ సురేష్ మధ్య పోటీ నెలకొంది.


అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్‌డీఎ తరుపున రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లాను పోటీకి దింపింది. ఇండియా కూటమి తరుపున కేరళలోని మావెలికరా నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన కోడికున్నిల్‌ సురేష్ పోటీకి దిగారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

విప్ జారీ..

డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తమ ఎంపీలంతా హాజరుకావాలని ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విప్‌లు జారీ చేశాయి. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు సభలోనే ఉండాలని సూచించారు.

ఓటింగ్ ఎందుకు?

వాస్తవానికి స్పీకర్ పదవి అధికార పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఏకాభిప్రాయం కోసం పార్లమెంట్‌లోని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విపక్షాల నుంచి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, డిఎంకె నుంచి టిఆర్‌ బాలు హాజరైన విషయం తెలిసిందే. డిప్యూటీ స్థానాన్ని కేటాయించకపోవడంతో వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

బిర్లా ఎన్నిక లాంఛనప్రాయం..

NDAకి 293 ఎంపీలు, ఇండియా కూటమికి 233 మంది ఎంపీలు ఉన్నారు. దాంతో బిర్లా ఎంపిక లాంఛనప్రాయం కానుంది. రాహుల్ గాంధీ తాను ఎన్నికైన రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం లోక్ సభలో 542 మంది సభ్యులున్నారు. ముగ్గురు స్వతంత్రులు ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్నారు. నలుగురు ఎంపీలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌ బిర్లాకు మద్దతు ఇస్తాయని ఎన్డీయే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు: సురేష్

స్పీకర్ ఎన్నికలో గెలుపు, ఓటములు ముఖ్యం కాదని పేర్కొన్నారు ఎంపీ సురేశ్. గత ఎన్నికలలో ప్రతిపక్ష హోదా లేదని రెండు సార్లు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు.

బిర్లాకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్లు దాఖలుకాగా, సురేష్‌కు మద్దతుగా మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

ఎవరీ ఓం బిర్లా..

రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి గెలిచిన బిజెపి ఎంపి 17 సంవత్సరాల వయస్సులో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో కోటా గుమన్‌పురాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

BJP సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో ఉన్న అనుబంధం కారణంగా 2014 నుండి కోట నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు కోట సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

RSS కుటుంబం నుంచి వచ్చిన బిర్లా తొలుత BJP యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో పనిచేశాడు. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ రాందాస్ అగర్వాల్‌తో బిర్లాకు సాన్నిహిత్యం ఏర్పడింది. సామాన్యుల సమస్యలపై బహిరంగ సభలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా ఎదిగారు. బిజెపి విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యుడిగా ఉన్న బిర్లా.. 1978లో కోటాలో స్థానిక పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తూ.. ముందుకు పోనివ్వకుండా రాజస్థాన్ మంత్రి కారు ముందు అడ్డంగా పడుకున్నాడు.

పార్లమెంటరీ వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేకపోయినా.. ఎంపీగా లోక్‌సభలో మంచి డిబేటర్‌గా రికార్డు ఉంది. దాంతో 2019లో లోక్‌సభ స్పీకర్ పదవికి బిజెపి బిర్లాను ఎంపిక చేసింది. 671 ప్రశ్నలు అడిగిన బిర్లా..118 డిబేట్‌లలో పాల్గొన్నారు.

బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైతే.. 1980 నుంచి 1989 వరకు అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన బలరాం ఝాఖర్ రికార్డును సమం చేస్తారు. స్పీకర్‌గా ఐదేళ్లు పనిచేసిన తర్వాత.. 22 ఏళ్లలో లోక్‌సభకు తిరిగి ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా బిర్లానే అవుతారు.

స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి 2002లో మరణించారు. అప్పట్లో మనోహర్ జోషి, మీరా కుమార్ ఎన్నికలలో ఓడిపోయారు. సుమిత్రా మహాజన్, సోమనాథ్ ఛటర్జీ పదవీ విరమణ చేశారు.

కె సురేష్ నేపథ్యం..

కొడికున్నిల్ సురేష్ ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. అత్యంత సీనియర్ లోక్‌సభ సభ్యులలో ఒకరు. ప్రస్తుతం కేరళలోని మావెలికర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సురేష్.. 2021లో కేరళ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ పదవికి పోటీపడ్డ వారిలో ఒకరు. తర్వాత కేరళ కాంగ్రెస్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా కూడా పనిచేశారు.

సురేష్ తొలిసారిగా 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆదూర్ నియోజకవర్గం నుంచి 1991, 1996, 1999 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 1998, 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తన కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని, క్రైస్తవుడని వచ్చిన ఆరోపణలపై కేరళ హైకోర్టు 2010లో ఆయనపై అనర్హత వేటు వేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది.

ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని రెండో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా కూడా ఉన్నారు.

ఇటీవలి ఎన్నికలలో సిపిఐ నుంచి పోటీచేసిన సిఎ అరుణ్ కుమార్‌ను సురేశ్ 10వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ఇంతకుముందు ఈ తరహా ఎన్నికలు మూడుసార్లు (1952, 1967, 1976) మాత్రమే జరిగాయి. 1976 తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Read More
Next Story