
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం: లూత్రా సోదరులకు కోర్టులో చుక్కెదురు
క్లబ్ ఓనర్లు సౌరభ్, గౌరవ్ లూత్రా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గోవా ప్రభుత్వ స్పందనను కోరిన ఢిల్లీ కోర్టు ..
గోవా(Goa)లోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్(nightclub) యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రాలకు ఢిల్లీ కోర్టు(Delhi court) బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన అగ్నిప్రమాదం(Fire accident)లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం తర్వాత సోదరులైన సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా థాయిలాండ్‌కు పారిపోయారు. వారిపై పోలీసులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. అయితే థాయిలాండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేయకుండా ఉండేందుకు వారు నాలుగు వారాల పాటు ముందస్తు బెయిల్‌ను కోరారు. అదనపు సెషన్స్ జడ్జి వందన గోవా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
మరో పార్ట్‌నర్ అరెస్టు..
నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అదుపులోకి తీసుకునేందుకు గోవా పోలీసులు ఢిల్లీలోని అతని ఇంటికి వెళ్లారు. అయితే అతను అక్కడ లేకపోవడంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అనంతరం అతనిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ ప్రక్రియ పూర్తయ్యాక గుప్తాను అరెస్టు చేస్తామని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.
నైట్‌క్లబ్ మరో యజమాని, బ్రిటిష్ పౌరుడు సురీందర్ కుమార్ ఖోస్లాపై LOC జారీ అయ్యింది. ఈ కేసులో ఇప్పటి వరకు నైట్‌క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్, ఉద్యోగి భరత్ కోహ్లీ పోలీసులు అరెస్టు చేశారు.

