మహారాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లా, రాష్ట్రానికి తొలి మహిళా పోలీస్ బాస్
మహారాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లాని ప్రభుత్వం నియమించింది.గురువారం రాత్రి నియమానికి సంబంధించిన ఉత్తర్వూలను హోంశాఖ జారీ చేసింది.
మహారాష్ట్ర పోలీస్ బాస్(డీజీపీ) గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లాని ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఆమె నియామకం ఖరారు అయింది. రాష్ట్ర హోంశాఖ రష్మీ శుక్లా నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె 1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి, శుక్లా వయస్సు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఇంతకు ముందు డిప్యూటేషన్ పై పారామిలిటరీ బలగానికి చెందిన సశాస్త్ర సీమాబల్ కు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.
ఇంతకుముందు మహారాష్ట్ర డీజీపీగా పనిచేసిన రజనీష్ సేథ్ డిసెంబర్ 31, 2023న పదవీ విరమణ చేశారు. తరువాత ముంబై పోలీస్ కమిషనర్ గా చేసిన వివేక్ ఫన్సల్కర్ రాష్ట్ర అదనపు డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా పోలీస్ బాస్ గా రష్మీ శుక్లా బాధ్యతలు తీసుకోవడంతో ఆయన పక్కకు తప్పుకోనున్నారు.
రష్మీ శుక్లాపై ఇంతకుముందు ఉన్న మహవికాస్ అఘాడీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రష్మీ శుక్లా ఇంటలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహించారు. ఆ సమయంలో ప్రతిపక్షనాయకుల ఫోన్ లు ట్యాప్ చేశారనే ఆరోపణలపై మహ వికాస్ అఘాడీ ప్రభుత్వం పూణే, కొలాబా స్టేషనల్లో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఫోన్ కాల్స్ తో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ నాయకుడు ఏక్ నాథ్ ఖడ్సే ఫోన్ ట్యాప్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ ల కంటే ముందు రష్మీ శుక్లా అప్పటి డీజీపీకి ఓ లేఖ రాశారు. పోలీస్ బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అందులో పలు ఆరోపణలు చేశారు. ఇదే అంశాన్ని ప్రతిపక్షనేతగా ఉన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. అనంతరం ఆమెపై ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు అయ్యాయి.
అయితే వీటిని బాంబే హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ లో కొట్టివేసింది. అంతకుముందే ఫోన్ ట్యాపింగ్ నివేదిక సైతం ప్రభుత్వానికి చేరింది. కేసును మూసివేయాలని విచారణ అధికారి నివేదిక ఇచ్చారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం శుక్లాని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించలేదు. దీంతో డీజీపీ ఆమె నియమాకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.