
‘మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం’
కేంద్రం చొరవ తీసుకోవాలన్న ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్ పవార్
ఎన్సీపీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) రైతుల ఆత్మహత్యల(Farmer suicides)పై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని కోరారు. 2024లో మహారాష్ట్ర(Maharashtra)లో 2,635 మంది రైతులు బలవన్మరణాలకు పూనుకున్నారని ఇటీవల రాష్ట్ర పునరావాస శాఖ గణాంకాలను విడుదల చేసింది.
"మారాఠ్వాడా, విదర్భ ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఖచ్చితమైన డేటా సేకరిస్తాం. రైతులను ఆదుకునేలా కేంద్రం ఒక విధానాన్ని రూపొందించాలి" అని పవార్ బారామతిలో మీడియాతో అన్నారు.
అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గంలో NCP (SP) నేత జయంత్ పాటిల్ చేరతారనే ఊహాగానాలపై శరత్ పవార్ స్పందించారు. ఆయన ఇప్పటికే తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారని చెప్పారు. శుక్రవారం పాటిల్ బారామతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్సీపీ (ఎస్‌పీ) చీఫ్‌ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను అసంతృప్తిగా లేనని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
చెరకు సాగులో ఏఐ..
కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అయిన పవార్.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, త్వరలో చెరకు సాగులో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం మొదలవుతుందని చెప్పారు.
"చెరుకు నాణ్యతను మెరుగుపర్చేందుకు AI టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని చాలా చక్కెర ఫ్యాక్టరీలు వాడుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం కొన్ని చక్కెర కర్మాగార అధికారులతో సమావేశం జరుగుతుంది. త్వరలో విప్లవాత్మక నిర్ణయం తీసుకుని, AI వినియోగాన్ని ప్రారంభిస్తాం" అని పవార్ వెల్లడించారు.
దేశ్‌ముఖ్ హత్య గురించి..
సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్యకేసుతో వార్తల్లో నిలిచిన బీడ్ జిల్లా ఒకప్పుడు శాంతియుతంగా ఉండేదని పవార్ వ్యాఖ్యానించారు. "బీడ్ ఇంతకుముందులా లేదు. అది ఒకప్పుడు ప్రశాంతమైన జిల్లా. నా పార్టీకి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడ విజయం సాధించారు. అయితే వారిలో కొందరు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆ ఫలితాలను చూస్తున్నాం" అని పవార్ పేర్కొన్నారు.