హామీలపై చేతులెత్తేసిన మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభుత్వం
x

హామీలపై చేతులెత్తేసిన మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభుత్వం

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దాకా ఉన్న పథకాలనే కొనసాగిస్తాం. కొత్త పథకాలకు నిధులు కేటాయించలేం’’ - ఆర్థిక మంత్రి అజిత్ పవార్.


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర(Maharashtra)లో బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం అప్పుల భారం కారణంగా హామీలను అమలు చేయలేకపోతోంది. సోమవారం (మార్చి 10) మొదటి బడ్జెట్ సమావేశాల్లో అప్పుల వివరాలు బయటపెట్టారు. రూ. 9.3 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లండించారు. 2024-25 లో ఇది రూ. 7.1 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 2 లక్షల కోట్ల అదనంగా పెరిగింది. దశాబ్దం క్రితం అప్పుతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

పెంపునకు తాత్కాలిక బ్రేక్..

'లాడ్కీ బహిన్'(Majhi Ladki Bahin Yojana) పథకం ద్వారా మహిళలకు ఇచ్చే డబ్బు రూ. 1,500 నుంచి రూ. 2,100కి పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని అమలు చేయడం తాత్కాలికంగా నిలిపేశారు. కొత్త పథకాల కంటే, ప్రస్తుతం ఉన్న పథకాల కొనసాగింపుపైనే సర్కారు దృష్టి పెట్టింది. 'లాడ్కీ బహిన్' పథకం లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లు. ప్రస్తుతం లబ్ధిదారులను పునఃసమీక్షిస్తూ వారి సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకానికి నిధులు కూడా గతేడాది కంటే రూ. 10,000 కోట్లు తక్కువగా కేటాయించారు. ఈ పథకానికి 2025-26 ఏడాదికి కేటాయింపు రూ. 36,000 కోట్లుగా అంచనా వేశారు. బీజేపీ ఎన్నికల హామీలో ప్రధానమైనది రైతు రుణమాఫీ. దీనికి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాతే దీని అమలుపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మార్పులు..

స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వార్షిక ప్రణాళిక కేటాయింపును 11% పెంచారు. అంటే రూ. 18,165 కోట్ల నుంచి రూ. 20,165 కోట్లకు పెరిగింది. ఇక కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులకు కొత్త నిధులను కేటాయించలేదు.

కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి..

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాహన సంబంధిత పన్నులను పెంచి రూ. 1,125 కోట్లు సంపాదించాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కాగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత హామీల అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) చెబుతున్నారు. ప్రస్తుతానికి కొత్త పథకాలకు నిధులు కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Read More
Next Story