Tragidy | మహారాష్ట్ర రైలు ప్రమాదంలో 13కి చేరిన మృతుల సంఖ్య
x

Tragidy | మహారాష్ట్ర రైలు ప్రమాదంలో 13కి చేరిన మృతుల సంఖ్య

మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, రైల్వే బోర్డు రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలు ఇవ్వనున్నారు.


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో రైలు ఢీ కొన్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కి చేరింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా గురువారం మరొకరు ప్రాణాలొదిలారు. మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాలు జల్గావ్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో ఉన్నాయి. ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని పాచోరా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

దర్యాప్తు, ఎక్స్‌గ్రేషియా..

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌ వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 1.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేలు, స్వల్ప గాయాలయిన వారికి రూ. 5వేలు ఇవ్వనున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్ మనోజ్ అరోరా గురువారం ఉదయం ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. ఘటనకు సంబంధించి ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నామని ఆయన చెప్పారు.

ప్రమాదం ఎలా జరిగింది?

ముంబయికి 400 కి.మీ. దూరంలోని మహేజి-పర్ధాడె స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ-ముంబయి పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ (Lucknow-CSMT Pushpak Express) రైలు సాధారణ బోగీలో మంటలు వచ్చాయని, అవి తమకు అంటుకుంటాయనే భయంతో తొలుత అలారం చెయిన్‌ను లాగారు. రైలు ఆగుతుండగా హడావుడిగా కిందికి దిగిన ప్రయాణికులు.. పక్కనున్న మరో ట్రాకుపైకి చేరారు. అదే సమయంలో ఆ ట్రాకుపై గంటకు 130-140 కి.మీ వేగంతో దూసుకువస్తున్న బెంగళూరు-న్యూదిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ (12627) రైలు.. వారిని ఢీ కొట్టింది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు ఆగే సమయంలో ప్రయాణికులు రెండువైపుల నుంచి కిందికి దూకారని, వారిలో అవతలి ట్రాకువైపు దిగినవారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ (Karnataka Express train) లోకోపైలట్ ప్రమాదాన్ని పసిగట్టలేక పోయాడని, బ్రేకులు వేసేందుకు సమయం సరిపోదని రైల్వేవర్గాలు తెలిపాయి. రెండు రైళ్ల లోకోపైలట్లు అన్ని నిబంధనల్ని పాటించారని, ప్రమాదం జరగకుండా శక్తిమేరకు ప్రయత్నించారని స్పష్టంచేశాయి.

చక్రాలు పట్టేయడంతోనే..

పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఓ సాధారణ ప్రయాణికుల బోగీ బ్రేకులు పట్టేయడం లేదా ఇరుసు బిగుసుకుపోవటం (హాట్‌ యాక్సిల్‌) వల్ల చక్రాలు తిరగక నిప్పురవ్వలు ఎగసిపడి, పొగలు కూడా వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. దాంతో ప్రయాణికులు భయపడ్డారని చెప్పారు. గాయపడినవారికి ప్రాణాపాయం లేదని చెప్పిన మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌.. మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాప్తిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More
Next Story