
మమత టార్గెట్ 215+
2026 అసెంబ్లీ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తోన్న పశ్చిమబెంగాల్ సీఎం
పశ్చిమ బెంగాల్(West Bengal) వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థుల ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం 294 స్థానాలకు 215కు మించి గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో వెల్లడించారు.
గత ఎన్నికల్లో బీజేపీ(BJP) నినాదాలను గుర్తు చేస్తూ.. ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ‘200 పార్’ (200 దాటుతాం) అని చెప్పి ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘400 పార్’ అని చెప్పి మెజారిటీ సాధించలేకపోయారు. అభిషేక్ (బెనర్జీ) చెప్పింది నిజమే. మేం టు థర్డ్ మెజారిటీ సాధిస్తాం. మా నమ్మకాన్ని మీరు నిజం చేయాలి. ఈసారి బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకూడదు," అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
టీఎంసీ(TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) కూడా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. "బెంగాల్ భవిష్యత్తును కాపాడుకుంటాం. పోరాటానికి సిద్ధమవుదాం. మమతా బెనర్జీని నాలుగోసారి ముఖ్యమంత్రిని చేద్దాం.. టీఎంసీ ఘన విజయానికి కృషి చేద్దాం," అని ఆయన అన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించగా.. బీజేపీ 77 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీఎంసీ తన మద్దతుదారులను ఉత్సాహపరుస్తూనే..బీజేపీని ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది టీఎంసీ.