‘మమతా పూర్తిసమయం మాట్లాడారు’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మమతా పూర్తి సమయం మాట్లాడారని, మధ్యలో ఆమె మైక్ స్విచ్ ఆఫ్ కాలేదని సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి మమతా బెనర్జీ మాత్రమే హాజరయ్యారు. తనకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వలేదని సమావేశం నుంచి వాకౌట్ చేశాక అదే విషయాన్ని విలేఖరులతో పంచుకోవడంతో వివాదం తలెత్తింది.
సమావేశానికి హాజరైన సీతారామన్ ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు. "ఆమె (మమత) పూర్తి సమయం మాట్లాడారు. మా టేబుల్స్ ముందు స్క్రీన్ సమయం చూపిస్తూనే ఉంది. మరికొందరు సిఎంలు తమకు కేటాయించిన సమయాన్ని మించి మాట్లాడారు. మైకులకు ఎవరూ కట్ చేయలేదు. ’’ అని పేర్కొన్నారు.
"తాను బెంగాల్ కోసం మాట్లాడుతున్నానని ఆమె చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఆమె చెప్పేదానితో నేను ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ ఇప్పుడు ఆమె బయట నిరాధారమైన విషయాలు చెప్పారు’’ అని మమత ట్వీట్ ద్వారా తెలుస్తుంది.
మీడియాతో మమత ఏం మాట్లాడారు?
మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని, బీజేపీ పాలిత అసోం, గోవా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారని మమత పేర్కొన్నారు. అయితే తనకు 5 నిముషాలు కూడా కేటాయించలేదని మమతా విలేఖరులతో అన్నారు.