బీఆర్ఎస్ ను ఓడించాలని మావోయిస్టు పార్టీ పిలుపు
మరికొద్ది గంటల్లో తెలంగాణాలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న తరుణంలో మావోయిస్టు పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
బీజేపీకి మద్దతిచ్చే అవకాశవాద పార్టీ అంటూ ఆగ్రహం
ప్రజాస్వామిక తెలంగాణను సాధిద్ధామంటూ ప్రకటన విడుదల
మరికొద్ది గంటల్లో తెలంగాణాలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న తరుణంలో సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికారప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ఆరుపేజీల లేఖలో దేశంలోని ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేసింది. హిందూత్వ ఫాసిస్లు బీజేపీ, ఆపార్టీకి మద్దతు ఇస్తున్న అవకాశవాద బీఆర్ఎస్ పార్టీలను తన్ని తరిమేయాలని, అలాగే ప్రతిపక్షపార్టీలను కూడా నిలదీయాలని జగన్ ప్రజలకు తాము పిలుపునిస్తున్నామని జగన్ తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య, దోపిడీ అనుకూల, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ మవోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 2014లో అధికారంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వారెలా ఉన్నారు? అంటూ జగన్ ప్రశ్నించారు. అధికారంలోకి రాక మునుపు కేసీఆర్ బడా భూస్వామి మాత్రమే అని, కానీ ఆరోజు దళారీ నిరంకుశ బడా పెట్టుబడిదారుడిగా అవతారమెత్తాడని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబంతో పాటు రాష్ట్ర సంపదంతా కొద్దమంది దళారీ బడా బూర్జువాల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. మెగా కృష్ణారెడ్డి, మురళి దివి కుటుంబం, పి.పిచ్చిరెడ్డి, పి.వి.కృష్ణారెడ్డి, బి.పార్థసారథిరెడ్డి కుటుంబం, రాంప్రసాద్ రెడ్డి, సి.ప్రతాప్‌రెడ్డి కుటుంబం, మైహోం రామేశ్వర్రావు లాంటి కొద్ది మంది దోపిడీ దారుల చేతుల్లో సొమ్మంతా పోగయ్యిందని జగన్ ఆరోపించారు.
*కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఎంత జరిగిందనేది ప్రజలందరికీ తెలిసందే. కాళేశ్వరం వల్ల గోదావరి పరివాహక ప్రజలకు చుక్క నీరు అందడం లేదు. కానీ మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు తరలించిన కేసీఆర్, కేసీఆర్ లాంటి భూస్వాములు మాత్రమే కాళేశ్వరం నీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వీరి ఆర్థిక ప్రయొజనాల కోసం ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, గ్రానైట్ విస్తరించాయి.
నారాయణపేట్ జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా) మరికల్ మండలం చిత్తనూర్ గ్రామం వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కల్పించిన అనుమతులతో ప్రజలు వ్యతిరేకిస్తున్న దళారీ నిరంకుశ బూర్పువాలైన కిచ్చెన్నగార లక్ష్మారెడ్డి, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి, (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువులు) యాజమాన్యంలో 2022 ఫిబ్రవరి 6వ తేదీన ఫార్మో ఆగ్రో ఇండ్రస్ట్రీస్ అనే సంస్థ ఇంథనాల్ పరిశ్రమను 500.5 ఎకరాల్లో నెలకొల్పారు. పెబ్బేర్ మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్న ఏబిడి కంపెనీ మరొకటి నెలకొల్పారు. బలవంతంగా నెలకొల్పిన ఈ కంపెనీలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హరితహారం, టైడర్ జోన్‌ల పేరుతతో సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం ఆదివాసులను అడవుల నుండి తరిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో దోపిడీ పాలకుల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతున్నాయి. ఈ సంక్షేమ పథకాల పేరుతో దోపిడీదారుల బొక్క నిండుతోంది. ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధి పచ్చి అబద్దం.* అంటూ తెలంగాణ మవోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్ తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ సాధించలేదని విమర్శించారు. ప్రజల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణాలో మోసపూరితంగా కేసీఆర్ అధికారాన్ని చేపట్టారని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని జగన్ విమర్శించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందన్నారు. అధికాంలోకి వచ్చే ముందు బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అవినీతితో తెలంగాణ ప్రజల బ్రతుకులను అధోగతిపాలు చేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయని విరోచిత పోరాటాల్లో ముందు వరుసన నిలబడ్డ ఎంతోమంది ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని, త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ పదేళ్ల నుండి దొరల కుటుంబం పాలిస్తూ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కొద్దిమంది దోపిడీదారులు మాత్రమే అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నియామకాల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే గ్రూప్-1 అనేక సార్లు వాయిదా వేస్తూన్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో మిగులు నిదులు ఉంటే ఇప్పుడు తెలంగాణాలో అప్పులు మిగిలాయని, నీళ్లు భూస్వాములకు తప్ప పేద, మధ్య తరగతి రైతులకు చేరడం లేదన్నారు. తాగు,సాగు నీటి రంగంలో మేడిగడ్డ బ్యారేజీ మొన్నటికి మొన్న కుంగిపోయిన సంగతి తెలిసిందే. లక్షల కోట్లతో నిర్మించిన బ్యారేజీ ఐదేళ్లు తిరగకుండానే కుంగిపోయిందంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియా, అవినీతి, గల్లీ గల్లీ బార్ షాపులు వంటి రంగాల్లో అభివృద్ధితో మూడు పువ్వులు ఆరుకాయలుగా బీఆర్ఎస్ పాలన సాగుతోందన్నారు.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆపై ప్రైవేటుపరం చేయడానికి పథకం వేశారని, విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలోని చేతివృత్తుల వారికి లక్ష రూపాయలు చేయూతనిస్తామని చెప్పి, మొండిచెయ్యి చూపించిందని, ఆసరా, రైతుబంధు, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలన ప్రవేశపెట్టిన కేసీఆర్ కుటుంబం ఆయన బంధుమిత్రులు లబ్దిదారులై వాటాలు పంచుకున్నారని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పైనా ఆగ్రహం :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర అధికారప్రతినిధి జగన్ మండిపడ్డారు. గత తోమ్మిదిన్నరేళ్లలో అమలు చేసిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల్లో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ లాక్‌డౌన్, పలు రైతు, కార్మిక చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారుల, ఆదివాసీ, మత మైనార్టీ వ్యతిరేక చట్టాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినిపోయిందన్నారు. దీంతో చిన్న పెట్టుబడిదార్లు చితికిపోయారని, మధ్యతరగతి వారు, కార్మికులు, రైతాంగం మొత్తంగా దేశ ప్రజానీకపు ఆర్థిక స్థితి ఘోరంగా దెబ్బతిన్నదని జగన్ విమర్శించారు.
చాలా కాలంగా అధికారాన్ని కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోందని, యూపీఏ అధికారంఓ ఉన్నప్పుడే ఉపా, ఎన్ ఐ ఏలను తీసుకువచ్చారని, వాస్తవానికి స్వతంత్ర్యం వచ్చిన నాటి నుండి కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, ఇన్నేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన ప్రజలు ఇప్పటికీ ఆపార్టీపై అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.