
మళ్లీ పార్టీలోకి ..
బహిరంగ క్షమాపణ తర్వాత మేనల్లుడిని తిరిగి చేర్చుకున్న బీఎస్పీ చీఫ్ మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) తన మనసు మార్చుకున్నారు. పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తన మేనల్లుడు (తమ్ముడి కొడుకు) ఆకాశ్ ఆనంద్(Akash Anand)ను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బహిరంగ క్షమాపణ కోరడంతో పార్టీలో పనిచేసేందుకు మరో అవకాశం ఇచ్చారు మాయవతి.
పార్టీ నుంచి బహిష్కరణకు దారితీసిన పరిస్థితులను ఆకాశ్ ఆనంద్ వివరిస్తూ..‘‘కొన్ని రోజుల క్రితం సామాజిక్య మాధ్యమం ఎక్స్‌లో నా పోస్టింగుల వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చింది. ఆ కారణంగానే బెహన్ జీ నన్ను పార్టీ నుంచి తొలగించారు. ఇకనుంచి నా వ్యక్తిగత సంబంధాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించకుండా చూసుకుంటాను. మామవతి నా ఏకైక రాజకీయ గురువు. రోల్ మోడల్ కూడా. నా తప్పులకు నేను ఆమెను బహిరంగ క్షమాపణ కోరుతున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
‘మరో అవకాశం ఇస్తున్నాం’
ఆకాష్ పోస్టుకు చూసిన మాయమతి కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పనిచేసేందుకు ఆయనకు మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఆకాష్ ఆనంద్ తన తప్పులను బహిరంగంగా అంగీకరించారు. సీనియర్లను గౌరవిస్తానని, తమ మామ మాటలకు లొంగనని, తన జీవితాన్ని BSPకి అంకితం చేస్తానని చెప్పారు. ఆ కారణంగా మరో అవకాశం ఇస్తున్నా’’ అని చెప్పారు.
ఆకాశ్ వివాదాస్పద వ్యాఖ్యలేమిటి?
‘‘బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని బుల్‌డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్షాలంటున్నాయి. అది బుల్డోజర్ల ప్రభుత్వం కూడా కాదు..ఉగ్రవాదుల ప్రభుత్వం’’ అని ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ ప్రభుత్వాన్ని అలా పోల్చినందుకు ఆయనతో పాటు మరో ముగ్గురిపై సీతాపూర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
బహుజన సమాజ్ నుంచి ఓట్లు అడుగుతున్న వారిని బూట్లతో కొట్టి తరిమేయాలని ఇటీవల ఒక సభలో ఆకాష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీతో అనుబంధం ఉన్న వారు అయోధ్య రామ మందిరాన్ని సందర్శించకూడదని పార్టీ నిర్ణయించిందని చెప్పడంతో ప్రజలు ఆకాష్ ఆనంద్‌ను వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేశారు. దీంతో మార్చి 3న మాయావతి ఆకాష్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించి, ఆయన తండ్రి ఆనంద్ కుమార్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆకాష్ తీరుతో నిరాశ చెందిన మాయావతి తాను జీవించి ఉన్నంతవరకు పార్టీ వారసుడిని ప్రకటించనని కూడా చెప్పారు.